'క్లబ్ సాంగ్స్‌'కి కేరాఫ్ అడ్రస్ 'జయమాలిని'.. బర్త్‌ డే స్పెషల్

క్లబ్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్ జయమాలిని.. బర్త్‌ డే స్పెషల్
జయమాలిని కీ క్రేజ్ తగ్గలేదు. ఒకప్పటి క్లబ్ సాంగ్స్ లో దాదాపు 600 సినిమాల్లో అలుపు లేకుండా నర్తించిన కెరీర్

నీ ఇల్లు బంగారం గానూ...గుగ్గుగ్గు గుడిసుంది...గుడివాడ ఎల్లాను...గుంటూరు పోయాను లాంటి ఐటమ్ సాంగ్స్ ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అలాగే జయమాలిని కీ క్రేజ్ తగ్గలేదు. ఒకప్పటి క్లబ్ సాంగ్స్ లో దాదాపు 600 సినిమాల్లో అలుపు లేకుండా నర్తించిన కెరీర్ తనది. తన డాన్సులతో రెండు జనరేషన్స్ ను ఛార్జ్ చేసిన చరిత్ర జయమాలి సొంతం. పెళ్లి తర్వాత అనూహ్యంగా తెరమరుగైనా.. తన నృత్యాభినయంతో ప్రేక్షకుల మదిలో చిరస్థానం సంపాదించుకున్న జయమాలిన బర్త్ డే ఇవాళ.

జయమాలినిది సినిమా కుటుంబమే. మేనత్త ఎస్పీఎల్ ధనలక్ష్మి తమిళ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేసేది. జయ పెద్దక్క జ్యోతిలక్ష్మి ఇండస్ట్రీలో ఉండగానే మాలిని ప్రవేశించింది. జయమాలిని అసలు పేరు అలివేలు మంగ. జాపపద బ్రహ్మ విఠలాచార్య జయమాలినిగా మార్చారు. నార్త్ లో హేమమాలిని జండా ఎగరేస్తున్న రోజులవి. అందుకే విఠలాచార్య తన పేరును అలా డిసైడ్ చేశారంటుంది జయమాలిని.

జయమాలిని తెర వదిలి వెళ్లి 22 ఏళ్లు దాటింది. అయినా క్రేజ్ తగ్గలేదు. జయమాలిని ఏమైపోయింది? ఎక్కడుంది...అని అల్లాడిన ప్రేక్షక హృదయాలెన్నో. అలా మధనపడినవారందరికీ మహదానందం కలిగించేందుకు కొన్నాళ్ల క్రితం ఓ అవార్టు ఫంక్షన్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలబడింది. ఆత్రేయగారి గుడిసె పాటకీ...వేటూరి వారి పుట్టింటోళ్లు తరిమేశారు పాటకీ డాన్స్ చేసి తెలుగు ప్రేక్షకులను మరోసారి ఉర్రూతలూగించింది. ఇండస్ట్రీనీ, ఆడియన్స్ నీ కలిపి ఒక్కసారిగా మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లింది.

జయమాలిని రీ ఎంట్రీ కోసం చాలామంది ఎదురు చూశారు. ఈ విషయంలో సాధారణ ప్రేక్షకులే కాదు.. ఎంతోమంది సినిమా వాళ్లూ కోరుకున్నారు. అదీ ఆమె స్టామినా.. ఛరిష్మా. జయమాలిని ఒక్క సౌత్ సినిమాల్లోనే కాదు.. బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. షాలీమార్ లాంటి బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాలో డాన్స్ చేసింది. రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాల్లో జయమాలిని పాట కంపల్సరీ. కేవలం ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు...కొన్ని సినిమాల్లో కారెక్టర్ రోల్స్ కూడా చేసి మెప్పించింది జయమాలిని. అప్పట్లోనే జయమాలినికి చాలా క్రేజ్ ఉండేది. ఎన్టీఆర్ జయమాలిని గురించి మాట్లాడుతూ...నా షూటింగుల దగ్గరకు వచ్చే జనాలు...నన్ను చూడ్డానికి వచ్చారా? లేక జయమాలినిని చూడ్డానికి వచ్చారో అర్ధం కావడం లేదనేవారట. అంత క్రేజు జయమాలిని అంటే.

అప్పటి ఐటమ్ గాళ్స్ కు ఇప్పటి వారికీ చాలా తేడా ఉంది. నాటి స్పెషల్ సాంగ్ డ్యాన్సర్స్ అంతా భారీగా ఉండేవారు. కానీ నేటి భామలు జీరో సైజ్ అంటూ పీలగా మారుతున్నారు. ఈ కారణంగానే చాలామంది ఇక్కడ ఐటమ్ గాళ్‌గా సెటిల్ కావాలని వచ్చిన ముంబై భామలు.. సింగిల్ సాంగ్ కే సర్దేసుకుంటున్నారు. ఏదేమైనా ఆడియన్స్ టేస్టు మేరకే జయమాలిని హవా నడిచింది. తెర మీద ఎలా కనిపించినా సీన్ అయిపోయిన మరుక్షణం చాలా మర్యాదగా నడుచుకునేది జయ అని కో ఆర్టిస్టుల కాంప్లిమెంటు. జయమాలిని అద్భుత విజయం వెనుక బోలెడు కృషి ఉంది....పట్టుదల ఉంది. తన వాళ్లను ఆదుకోవాలనే తపన ఉంది.

తనపై ఓ కుటుంబం ఆధారపడి ఉంది అనే మాట కోసమే వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. దానికి తోడు ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండటంతో అప్పట్లో ఏడాదికి వంద సినిమాలు విడుదలైతే అందులో 70శాతం సినిమాల్లో జయమాలిని నర్తించేది. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోనీయలేదు. పట్టుమని 50 సినిమాలు చేయడం పెద్ద గగనమవుతోంది ఇప్పుడు. అలాగే, వచ్చిన నాలుగైదేళ్లకే కనుమరుగవుతున్నారు. జయమాలిని రికార్డ్ సాధించడం కానీ, జయమాలిని ఏలినంత కాలం కంటిన్యూ కావడం... ఏ ఐటమ్ తారకైనా ఇప్పుడు అసాధ్యం. బిగ్ కమర్షియల్ డైరెక్టర్లు కె.ఎస్.ఆర్ దాస్, రాఘవేంద్రరావు, ఎస్.డి.లాల్ జయమాలిని పాట లేకుండా సినిమా తీసింది లేదు.

దర్శకరత్న దాసరి నారాయణరావు జయమాలినికి ప్రత్యేక పాత్రలు ఆఫర్ చేశారు. ఇదెక్కడి న్యాయం మూవీలో జయమాలినిది డిఫరెంట్ రోల్. అలాగే కన్యాకుమారి లో హీరోయిన్ గా చేయించారు దాసరి. వీటితో పాటు అదే దాసరి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసినా.. మంచి పాత్రలిచ్చినందుకు ఆయన్ని మరచిపోలేనంటుంది జయమాలిని. జయమాలిని పెళ్లి చేసుకుంటోందట అనేది అప్పట్లో సెన్సేషనల్ న్యూస్. సినిమాహాల్ ముందు టిక్కెట్ల కోసం పడిగాపులు పడే జనానికి ఇదే టాపిక్కు. ఫైనల్ గా 1994 జులై 19న పోలీస్ డిపార్ట్‌మెంట్ లో రైటర్ గా పనిచేస్తున్న పార్తీబన్ ను పెళ్లాడేసి.. ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. ఆమె చేసిన డ్యాన్సులు, పాత్రలు ఎలాంటివైనా.. వ్యక్తిత్వంలో జయకు సాటి మరెవరూ లేరు అని ఆమెను బాగా ఎరిగిన వాళ్లు చెప్పే మాట. అలాంటి జయమాలిని మరింత హ్యాపీగా ఉండాలని కోరుకుందాం..

Tags

Next Story