కేజీఎఫ్ హీరో.. రైతుల కోసం..

కేజీఎఫ్ హీరో.. రైతుల కోసం..
సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్న తరుణంలో సిల్వర్ స్క్రీన్ తలుపు తట్టింది. దాంతో సినిమాల్లో నటించాలన్న తన కోరిక..

అయిదోక్లాసులో ఉన్నప్పుడే క్లాసులో మాస్టారు.. పెద్దయ్యాక ఏమవుతావురా అబ్బాయ్ అంటే.. సినిమా హీరోనవుతా సార్ అని అనేసరికి క్లాసులో అంతా నవ్వారు. వాళ్లు ఎందుకు నవ్వారో అర్థం కాకపోయినా తన లక్ష్యం హీరో కావడమే అనుకున్నాడు కేజీఎఫ్ హీరో యశ్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సాధారణ జీవితం గడుపుతున్నా హీరో అవ్వాలన్న ఆలోచనను మాత్రం మానుకోలేదు.. అనుకోకుండా నాటకంలో వచ్చిన అవకాశం అంచలంచెలుగా ఎదిగేలా చేసింది. అటుపై సీరియల్స్‌లోనూ ఆఫర్లు వచ్చాయి.

సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్న తరుణంలో సిల్వర్ స్క్రీన్ తలుపు తట్టింది. దాంతో సినిమాల్లో నటించాలన్న తన కోరిక నెరవేరింది. అయితే కేజీఎఫ్‌తోనే యశ్ అంటే ఎవరో తెలిసింది ప్రేక్షకులకి. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదలవడంతో కన్నడ హీరో యశ్ తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని రైతుల హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్నారు. ఇక్కడి కొప్పల్ జిల్లాలో వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తాళ్లూరు చెరువు నీటిపై చుట్టుపక్కల 25 గ్రామాల ప్రజలు ఆధారపడతారు. 2012 తరువాత వర్షాలు పడక చెరువు ఎండిపోయింది.

దాంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిని ప్రజలు ఎదుర్కొన్నారు. అనేక పశువులు మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న యశ్ రైతుల వద్దకు వెళ్లారు. వాళ్లు పడుతున్న కష్టాలు స్వయంగా చూసి తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా 2016లో 'యశోమార్గ ఫౌండేషన్‌'ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా కాల్బుర్గీ, రాయ్‌చూర్, గడగ్, బెళగావి, బీదర్, యాద్గిరి, బాగల్‌కోట ప్రాంతాల్లోని అరవై గ్రామాల్లో చెరువుల పూడికలు తీయించి రైతన్నలకు అండగా నిలిచారు.

ఇప్పటికీ మరికొన్ని గ్రామాల్లో చెరువుల పూడికతీత పనులు కొనసాగిస్తున్నారు. వేసవిలో పశువులకు మేత, ఇళ్లకు తాగేందుకు మంచి నీళ్లు డ్రమ్ముల ద్వారా సరఫరా చేస్తుంటారు. నిరుపేద రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తుంటారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేయాలని భావిస్తున్నారు యశ్.

Tags

Next Story