ఏనుగుల మృతికి కారణమైన రైలు.. ఆగ్రహించిన అటవీ అధికారులు..

అడవిలో స్వేచ్ఛగా విహరిస్తున్న ఆ తల్లి బిడ్డలను వేగంగా వస్తున్న రైలు పొట్టన పెట్టుకుంది. అటవీ ప్రాంతం గుండా వెళ్లేటప్పుడు ఇంజన్ స్పీడు తగ్గించాలన్న ఫారెస్ట్ అధికారుల విజ్ఞప్తిని తుంగలో తొక్కి రెండు ఏనుగుల మృతికి కారణమైన రైల్వే శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసారు అటవీ శాఖ అధికారులు. ఇందుకు భారీ మూల్యం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏనుగుల మృతికి కారణమైన రైలు ఇంజన్ ను అసోం అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 27న లుండింగ్ రిజర్వ్ ఫారెస్ట్ లోని రైలు పట్టాలపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ఆడ ఏనుగు, ఏడాది వయసున్న గున్న ఏనుగు మృతి చెందాయి. రైల్వే ప్రాజెక్టులకు సరుకులను తరలించడానికి ఈ రైలును వినియోగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత వేగంగా ప్రయాణించడంతో ఏనుగుల మృతి చెందాయని అసోం అటవీ శాఖ మంత్రి పరిమళ్ శుక్లాబైద్య అన్నారు.
ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అటవీ శాఖ వెల్లడించింది. అటవీ అధికారుల బృందం బామునిమైదాన్ లోకోమోటివ్ షెడ్ కు వెళ్లి ఇంజన్ ను స్వాధీనం చేసుకుందని తెలిపింది. ప్రమాదానికి కారణమైన లోకోమోటివ్ పైలెట్, అతడి సహాయకుడిని సస్పెండ్ చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది. కాగా ప్రజా సేవలను కొనసాగించడం దృష్ట్యా రైలు ఇంజన్ ను తిరిగి రైల్వే శాఖకు అప్పగిస్తూ.. నష్ట పరిహారంగా రూ.12 కోట్లు అటవీ శాఖకు ఇచ్చేందుకు రైల్వే అధికారులు అంగీకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com