రాజధానిలో రైతన్నల నిరాహార దీక్ష.. కేజ్రీవాల్ సైతం..

రాజధానిలో రైతన్నల నిరాహార దీక్ష.. కేజ్రీవాల్ సైతం..
X
సోమవారం నుంచి తమ పోరును మరింత ఉధృతం చేయదలచి నిరాహార దీక్ష చేపట్టారు.

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో గత కొన్ని రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతలు ఉద్యమం సాగిస్తున్నారు. సోమవారం నుంచి తమ పోరును మరింత ఉధృతం చేయదలచి నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేయనున్నట్లు రైతు సంఘాల నాయకులు తెలిపారు. దిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోని ఘజీపూర్ రహదారిపై భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ సహా ఇతర నాయకులు నిరాహార దీక్షలో పాలు పంచుకుంటున్నారు. హరియాణా సరిహద్దులోని సింఘు, టిక్రీ వద్ద కూడా అన్నదాతల నిరసన దీక్ష కొనసాగుతోంది. దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నేడు దీక్షలు జరుపుతామని రైతు సంఘాల నాయకులు తెలిపారు.

అన్నదాతలకు మద్దతు ప్రకటించిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. తానూ దీక్షలో పాల్గొంటానని వెల్లడించారు. అయితే దీనిపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. రైతుల పట్ల కేజ్రీవాల్ కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిస్తే ఏపీఎంసీ చట్టంలో సవరణలు చేస్తామని అప్పట్లో మీరు హామీ ఇచ్చారు. 2020 నవంబరులో దిల్లీలో వ్యవసాయ చట్టాలనై నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రోజు రైతుల కోసం దీక్ష చేస్తామంటున్నారు. ఇదంతా కపట ప్రేమే అని కేజ్రీని దుయ్యబట్టారు జావడేకర్. రైతుల ఆందోళనల నేపథ్యంలో హరియానా-రాజస్థాన్ సరిహద్దును పోలీసులు మూసివేశారు. దిల్లీకి రైతులు రాకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags

Next Story