అహ్మద్ పటేల్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూశారు. కరోనాతో దాదాపు నెలన్నర రోజుల పాటు పోరాడుతూ మృతి చెందారు. గురుగావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. 71 ఏళ్ల వయస్సున్న అహ్మద్ పటేల్‌కు గత కొద్ది రోజులుగా శరీరంలోని పలు అవయవాలు సరిగ్గా పని చేయకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించిందని.. ఈ నెల 15 నుంచీ ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
అహ్మద్ పటేల్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇది విచారకరమైన రోజని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మూలస్థంభమని... పార్టీతో కలిసి చాలా కష్ట సమయాల్లోనూ నిలబడ్డారని గుర్తు చేశారు. ఆయనను కోల్పోవడం బాధాకరమన్నారు. ఫైజల్, ముంతాజ్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. అటు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా సంతాపం ప్రకటించారు.
పటేల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఆయన సమాజానికి ఏళ్ల తరబడి సేవలందించారని కొనియాడుతూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పటేల్ కృషి చేశారన్నారు. పటేల్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నట్లు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.
గుజరాత్‌కు చెందిన అహ్మద్ పటేల్.. మొదటిసారిగా 1977లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎనిమిది సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయిన ఆయన.. మూడు సార్లు లోక్ సభకు, ఐదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కోశాధికారిగా పనిచేస్తోన్న ఆయన... గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అత్యంత కీలక నేతగా గుర్తింపు పొందారు. రాజీవ్ గాంధీ హయాం నుంచి ఆయన కాంగ్రెస్‌తో ఉన్నారు. ట్రబుల్ షూటర్‌గా పేరున్న ఆయన.. సుదీర్ఘకాలం సోనియాంగాధీకి రాజకీయ సలహాదారుగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com