Air India: మద్యం మత్తులో వ్యక్తి వీరంగం... మహిళ పై మూత్ర విసర్జన

పూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఆ మత్తులో విచక్షణ మరిచాడు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ మహిళా ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది.
న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తోన్న ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్ లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. ఈమేరకు బాధిత మహిళ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆ మహిళ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది.
ఎయిలైన్స్ ప్రయాణీకుల భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత మహిళ వాపోయింది. నవంబర్ 26, 2022లో A-102 ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది.
విమానంలో ప్రయాణం చేస్తున్న సమయంలో భోజనానంతరం లైట్లు ఆఫ్ చేశారని, సరిగ్గా అదే సమయంలో మద్యం సేవించిన వ్యక్తి ఇంకో ప్రయాణికుడి సీటుపై మూత్ర విసర్జన చేశాడని తెలిపింది. అనంతరం తన సీటు దగ్గరకు వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించింది. ఈ ఘటన కారణంగా తన వస్తువులన్నీ తడిసిపోయాయని మహిళ తెలిపింది. ఇక మద్యం సేవించిన ఆ వ్యక్తిని 'నో ఫ్లై లిస్ట్'లో పెట్టాలని బాధిత మహిళ డిమాండ్ చేస్తూ తాను రాసిన లేఖలో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com