Akhilesh Yadav : అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు.. !

Akhilesh Yadav : యూపీలో ఎన్నికల ఫలితాల వేళ బాంబు పేల్చారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందని ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వారణాసి జిల్లా కలెక్టర్ ఈవీఎంలను తరలించారని, ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఈవీఎంలను బయటకు తీయడమేంటని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా దొంగతనం కిందకే వస్తుందని అన్నారు. మన ఓట్లు మనం కాపాడుకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారని, దీనిపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు.
వారణాసిలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ముందు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ అఖిలేష్ ఆరోపించిన కొద్ది సేపటికే ఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారణాసిలోని పహారియా మండి ప్రాంతంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఎస్పీ కార్యకర్తలు.. సేవ్ డెమొక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇక.. మీరట్ జిల్లా హస్తినాపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదిపార్టీ తరఫున పోటీచేసిన యోగేశ్‌వర్మ మాత్రం బైనాక్యులర్‌తో కాపలాకాస్తూ ఎదురు చూస్తున్నా రు. 2007లో బహుజన్‌సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వర్మ 2012, 2017లో పీస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఎస్పీ తరఫున పోటీచేసిన వర్మ అవకతవకలు ఏమైనా జరుగుతాయేమోనన్న భయంతో ఈవీఎంలపై బైనాక్యులర్‌తో నిఘా పెట్టారు.
కాగా యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. గెలుపునకు సంబంధించి వివిధ ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. ఆ అంచనాల ప్రకారం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ మరోసారి భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com