Akhilesh Yadav : ఎమ్మెల్యే పదవికి అఖిలేష్ యాదవ్ రాజీనామా?

Akhilesh Yadav : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అఖిలేష్ ప్రస్తుతం అజంగఢ్ నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు... అయితే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. కర్హాల్ అసెంబ్లీ స్థానంలో అఖిలేష్ 67,504 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయనకు 1,48,196 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ (బీజేపి)కి చెందిన కేంద్ర మంత్రి ఎస్‌పి సింగ్ బఘేల్‌కు 80,692 ఓట్లు వచ్చాయి. అఖిలేష్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం విశేషం.
సీఎంగా ఉన్న సమయంలో అఖిలేష్ యాదవ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. ఇక అఖిలేష్ యాదవ్ తో పాటుగా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మరో నేత ఆజం ఖాన్ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారట.. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రామ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం రాంపూర్ స్థానం నుంచి ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ అజంగఢ్‌తో సహా ఐదు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
లోక్ సభలో తమ పార్టీ సంఖ్య బలహీనపడకుండా ఉండేందుకు వీరిద్దరూ తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ బాధ్యతలను శివపాల్ యాదవ్‌కు అప్పగించే ఆలోచనలో అఖిలేష్ ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com