Batukamma Samburalu: గల్లీ నుంచి ఢిల్లీ వరకు బతుకమ్మ సంబరాలు..

Batukamma Samburalu: గల్లీ నుంచి  ఢిల్లీ వరకు బతుకమ్మ సంబరాలు..
X
Batukamma Samburalu: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారిగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటేలా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వేడుకలు నిర్వహిస్తున్నాయి.

Batukamma samburalu : బతుకమ్మ సంబురం.. పొలిటికల్ టర్న్ తీసుకుంది. పల్లెలు.. పట్టణాలు, ఊరువాడల్లో తెలంగాణ ఆడపడుచులే కాదు.. రాజకీయ పార్టీలు సైతం పూలపండుగలో మునిగితేలుతున్నాయి. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ అన్ని ప్రధాన పార్టీలు పాట పాడుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారిగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటేలా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వేడుకలు నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్రమంత్రులు.. బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడుతున్నారు.

మూడోరోజు.. తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, పద్మా దేవేందర్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, వరంగల్ మేయర్ సుధారాణి.. మహిళలతో కలిసి ఆడిపాడారు. బతుకమ్మ సంబురాలతో టీఆర్ఎస్ భవన్ సందడిగా మారింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో తెలంగాణ పూలపండుగతో సందడి నెలకొంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో పలువురు కేంద్రమంత్రులు, వారి కుటుంబసభ్యులు, ఢిల్లీలోని తెలుగువారు పాల్గొనగా.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం ఆడిపాడారు. ఢిల్లీ గడ్డపై బతుకమ్మ సంబరాలు జరగడం.. తెలంగాణ ఆత్మగౌరవానికి దక్కిన ప్రత్యేకమైన గుర్తింపు అని కిషన్‌రెడ్డి కొనియాడారు.

అటు ఇండియా గేటు వద్ద బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. హస్తినలో పూలపండుగను నిర్వహించడంపై ఎమ్మెల్సీ కవిత.. బీజేపీకి చురుకలంటించారు. సీఎం కేసీఆర్ వల్ల ఢిల్లీలో, ఇండియా గేటు వద్ద బతుకమ్మ వేడుకలు జరగడం గర్వంగా ఉందన్నారు.

జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ దృష్టి సారిస్తున్నందునే ఢిల్లీలో బతుకమ్మ పండుగ జరుగుతోందని.. తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ల తర్వాత బీజేపీకి బుద్ధి వచ్చిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

మరోవైపు.. టీఆర్ఎస్, బీజేపీలతో పాటు కాంగ్రెస్ కూడా పూలపండుగలో పోటీపడింది. బతుకమ్మ పండుగతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ అప్పటి ఫోటోను కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విటర్‌లో షేర్ చేశారు. 1978లో ఓరుగల్లులో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో తన నానమ్మ ఇందిరాగాంధీ పాల్గొనడం ఒక మధుర స్మృతి అని తెలిపారు.

ప్రకృతిని ప్రేమిస్తూ, పువ్వులను పేర్చి, ఊరు వాడా కలిసి చేసుకునే ఈ పండుగ రాష్ట్ర ప్రజలకు సంతోషాన్ని కల్గించాలంటూ తెలంగాణ ప్రజలు, ఆడపడుచులకు ట్విట్టర్ వేదికగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలంగాణలో మునుగోడు రాజకీయాలు కాకరేపుతున్న వేళ.. కాంగ్రెస్‌ పార్టీ సర్వే సర్వేలు గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించింది. ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సహా కాంగ్రెస్ మహిళా నేతలు, కార్యకర్తలు ఆడిపాడారు.

తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడల్లో ఉయ్యాల పాటలు మార్మోగుతున్నాయి. పూల సింగిడి భువికి దిగిందా అన్నట్లుగా తెలంగాణ నేల.. బతుకమ్మలతో మురిసిపోతోంది. తెలంగాణ మహిళలు, ఆడపడుచుల ఆటపాటలతో ఊరువాడ హోరెత్తిపోతోంది.

Tags

Next Story