Ambani: పెళ్లి సందడి...

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని అంబానీల నివాసం అంటిలియా గుజరాతీ హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. విరెన్ మర్చంట్ ఇంటికి అనంత్ అంబానీ సోదరి ఈషా అంబానీ వెళ్లి రాధికా మర్చంట్‌ను ఆహ్వానించడంతో నిశ్చితార్ధ వేడుకలు ప్రారంభమయ్యాయి. అంటిలియా చేరుకున్న మర్చంట్ ఫ్యామిలీకి అంబానీ కుటుంబం ఘనస్వాగతం పలికింది. అనంత్, రాధికను శ్రీ కృష్ణ మందిరానికి తీసుకువెళ్లి ఆశీర్వచనాలు అందించారు. అక్కడి నుంచి నిశ్చితార్థ వేదికపైకి వెళ్లి గణపతి పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం లగ్న పత్రికను చదివి వినిపించారు.
గుజరాతీ హిందూ సంప్రదాయాలైన గోల్డ్ ధన, చునారి విధి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఇరు కుటుంబాలు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని ఉత్సాహంగా గడిపాయి. ఈ సందర్భంగా నీతా అంబానీ నేతృత్వంలో అంబానీ ఫ్యామిలీ చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ వేడుకల తర్వాత అనంత్, రాధికా ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. తొందరలోనే వీరి వివాహం జరగనుంది.
ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసిన సెలబ్రిటీ అతిరథమహారథులతో అంబానీల లోగిలి మెరిసిపోయిందనే చెప్పాలి. రణ్ వీర్-దీపికాపదుకోణే, ఐశ్వర్యారాయ్, కత్రినాకైఫ్, జాన్వీ కపూర్, అనన్యాపాండే, సారాఅలీఖాన్, కరణ్ జోహార్, వరుణ్ ధవన్ నిశ్చితార్థ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com