అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం కేసు దర్యాప్తు ముమ్మరం

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో కనుగొన్న పేలుడు పదార్థాల వాహనం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే మూడు వాహనాలను కనుగొనగా.. తాజాగా మరో రెండు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో అరెస్టై, సస్పెన్షన్‌కు గురైన ముంబయి పోలీసు అధికారి సచిన్ వాజే ఈ వాహనాలను వినియోగించినట్లు అనుమానిస్తున్నారు. వీటిలో ఒకటి ఠాణేలోని సాకేత్ ప్రాంతంలో వాజే నివాసం బయట గుర్తించినట్లు ఎన్‌ఐఏ అధికారి ఒకరు తెలిపారు.
దీంతో సచిన్ వాజే కేంద్రంగా ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది.ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీల్లో పీపీఈ కిట్ ధరించి ఉన్న వ్యక్తి వాజేనే అని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే అది పీపీఈ కిట్ కాదని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వాజే కార్యాలయంలోనూ తనిఖీలు చేసిన అధికారులు ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తుపై శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఈ కేసులో ముంబయి పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న పరమ్‌బీర్ సింగ్‌పై బదిలీవేటు పడింది. ఆయనను అంతగా ప్రాధాన్యం లేని హోంగార్డుల విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఆయన సహచరులు కొందరు తీవ్రమైన తప్పుల వల్లే బదిలీ చేసినట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. కేసును ఎన్‌ఐఏతో పాటు, ఉగ్రవాద నిరోధక బృందం చాకచక్యంగా దర్యాప్తు చేస్తున్నాయని.. దోషులుగా తేలినవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com