Anna Durai: పేరుకు ఆటో డ్రైవర్.. బిజినెస్ దిగ్గజాలకే పాఠంగా మారాడు..

Anna Durai: పేరుకు ఆటో డ్రైవర్.. బిజినెస్ దిగ్గజాలకే పాఠంగా మారాడు..
Anna Durai: తన ఆటోకోసమే కస్టమర్లు ఎదురు చూస్తుంటారని ఒకింత గర్వంగా చెబుతుంటాడు..

Anna Durai: ఆటో డ్రైవర్ అన్నాదురై ఏ రోజూ కస్టమర్లకోసం ఎదురుచూడలేదు.. తన ఆటోకోసమే కస్టమర్లు ఎదురు చూస్తుంటారని ఒకింత గర్వంగా చెబుతుంటాడు.. ఎందుకో అంత స్పెషల్.. ఏం ఉంది అతడి ఆటోలో అని ఆరా తీస్తే.. ఒకటి రెండూ కాదు.. చెప్పాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చెన్నైకి చెందిన 33 ఏళ్ల అన్నాదురై బాగా చదువుకుని పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలని ఆశపడ్డాడు. కానీ పరిస్థితులు అందుకు అనుకూలించలేదు..

12వ తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది.. అయినా నిరుత్సాహపడలేదు.. అవకాశాలకోసం ఎదురు చూడలేదు.. ఆటో డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. దాదాపు 10 సంవత్సరాల నుంచి చెన్నై వీధుల్లో అన్నాదురై ఆటో తిరుగుతోంది.. ఆయన ఆటో ఎక్కాలని పోటీ పడుతుంటారు తమిళ తంబీలు. అన్నాదురై ఆటో ఎక్కితే కస్టమర్లకి ఎంత కాలక్షేపమో.



పాటలేమైనా పెడతాడా.. కాదు కాదు.. ఎక్కిన వాళ్లే ఎంచక్కా పెట్టేసుకోవచ్చు.. పాటలు ఇష్టం లేదా.. పది పత్రికలున్నాయి.. ఏదో ఒకటి తీసి చదువుకోవచ్చు. బయట ఎండమండుతోంది.. చల్లగా ఏమైనా తాగాలని ఉందా.. ఆటోలో ఫ్రిజ్ ఉంది అందులో కూల్ కూల్‌గా మాజా ఉంది.. అన్నీ ఫ్రీ.. సింగిల్ ఎన్‌పీ కూడా పే చేయక్కరలేదు.. అవును.. కస్టమర్లే తన నిజమైన దేవుళ్లు అంటాడు అన్నాదురై.

తన ఆటో ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, ప్రయాణికులకు అందించడానికి దాదాపు 40 మ్యాగజైన్‌లు ఉంచానని చెబుతాడు. సమయం అత్యంత విలువైనది కాబట్టి వృధా చేయకూడదు. మీ స్మార్ట్‌ఫోన్ నెట్ ఆఫ్ అయితే వై-ఫైకి కనెక్ట్ చేయడానికి ట్యాబ్‌తో పాటు ఉచిత వై-ఫై అందించబడుతోంది.

ఇంకా తన దగ్గర ల్యాప్‌టాప్, ఐప్యాడ్, కార్డ్-స్వైపింగ్ మెషీన్‌లు, మాస్క్‌లు, శానిటైజర్‌లు ఉన్నాయి. జేబులో డబ్బులు లేకపోయినా పర్లేదు. కార్డు ఉంటే చాలుపేమెంట్ చేసేయొచ్చు. ఆ సౌకర్యం కూడా ఆటోలో ఉంది మరి. చెన్నై వాతావరణంలో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు.. ఆ కారణంగా కస్టమర్లు ఆఫీసులు మానేయకూడదని తడవకుండా తగిన ఏర్పాట్లు చేశాడు.

ప్రేమికుల రోజున ప్రేమికులందరికీ, మదర్స్ డే నాడు పిల్లలతో ఉన్న తల్లిదండ్రులకు, 18 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత రైడ్‌లను అందిస్తాడు. ఇక ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే, తన పుట్టినరోజు వంటి సందర్భాలలో 50% తగ్గింపును అందిస్తాడు. తన రెగ్యులర్ కస్టమర్ల కోసం ప్రతి నెలా ఒక పోటీని నిర్వహిస్తాడు. అందులో గెలుపొందిన కస్టమర్‌లకు బహుమతులు అందజేస్తాడు.

వీటన్నింటి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం కేవలం నా ఆటోను ప్రమోట్ చేయడం అనుకుంటారు చాలా మంది.. కానీ నా ఉద్దేశ్యం అది కాదు టీనేజ్‌లో ఉన్న యువతీ యువకులకు సమాజం పట్ల తమకున్న బాధ్యతను తెలియజెప్పడమే.

7-సార్లు TEDxలో ప్రేరణాత్మక స్పీచ్‌లు ఇచ్చాడు. తనకి ఓ వెబ్‌సైట్, యాప్ కూడా ఉన్నాయి. మీరు తన గురించి చదవడానికి తనకి ఉన్న కొన్ని ప్రత్యేకతలే కారణం అని అంటాడు అన్నాదురై. ఉపాధ్యాయులు, శానిటైజ్ సిబ్బందికి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నాడు. అన్నాదురైపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.



మొదట్లో కస్టమర్ల కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని, ఇప్పుడు జనం తన కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చిందని అన్నాదురై అంటున్నారు. స్వస్థలం చెన్నైలోని తంజావూరు జిల్లా పెరవూరని గ్రామం. అతని తండ్రి, అన్నయ్య ఇద్దరూ ఆటో డ్రైవర్లు. ఆర్థిక సమస్యల కారణంగా 12వ తరగతిలోనే చదువు మానేసినా తన కొత్త వృత్తిలో జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకున్నాడు. మొదట్లో తన ఆటోలో న్యూస్ పేపర్ మాత్రమే పెట్టేవాడు. క్రమంగా కస్టమర్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సౌకర్యాలు పెంచుకున్నాడు.

పెద్ద పెద్ద కంపెనీలు అతడి ప్రసంగం కోసం ఆహ్వానాలు పలికాయి. అన్నా దురై వృత్తి రీత్యా ఆటో రిక్షా డ్రైవర్ కావచ్చు, కానీ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడతారు. ఆయనను ప్రశంసించిన వారిలో ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు.

ఆయన అన్నాదురై యొక్క అద్వితీయమైన మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను మెచ్చుకున్నారు. అన్నాదురైని ఆనందర్ మహీంద్రా 'ప్రొఫెసర్ ఆఫ్ మేనేజ్‌మెంట్' అని పిలుస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆయనను ప్రసంగాలకు ఆహ్వానిస్తాయంటే అతని పాపులారిటీని అంచనా వేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. అన్నాదురై తన ఆటోను ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌గా మార్చుకున్నాడు. ఇది గొప్ప ఆలోచన అని కేటీఆర్ అన్నాదురైని కీర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story