AP: ఆరునెలల్లో గోదావరి-కృష్ణా- పెన్నా- కావేరి నదుల అనుసంధాన ప్రక్రియ

ఆరునెలల్లో గోదావరి-కృష్ణా- పెన్నా- కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై రాష్ట్రాల ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు జాతీయ నీటిఅభివృద్ధి సంస్థ కార్యాచరణ ప్రారంభించింది. నదుల అనుసంధానంపై రాష్ట్రాలతో దశల వారీగా సంప్రదింపులు చేపట్టిన ఎన్‌డబ్ల్యూడీఏ టాస్క్‌ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా 30 లింక్స్ ఉండగా తొలిదశలో ఐదు లింక్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యాంశం కింద చేపట్టింది. మొదట కెన్-బెత్వా లింక్‌పై చర్చ జరిగింది. అనంతరం గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై చర్చ జరిగింది. భాగస్వామ్య రాష్ట్రాలు వాటి డిమాండ్లను ప్రస్తావిస్తూనే సానుకూలతను వ్యక్తం చేశాయి.
ఇక ఈ సమావేశంలో తమ ప్రాజెక్టుల నీటి కేటాయింపులకు ఇబ్బందుల్లేకుండా అనుసంధానం చేపడితే అభ్యంతరం లేదని తెలంగాణ, ఏపీ చెప్పాయని సమాచారం. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడుల్లోని కరవు ప్రాంతాలకు మేలు చేయనున్న ఈ లింక్ నిర్మాణంపై రాష్ట్రాలు సహకరించాలన్నారు. ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ ఈ లింక్ పైన విశ్లేషించారు. దీంతో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 141 టీఎంసీలను తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సందేహాలకు ఎన్‌డబ్ల్యూడీఏ టాస్క్‌ఫోర్స్ వివరణ ఇచ్చింది.
ఇక గోదావరిలో మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ చెబుతున్నా.. ఏటా వేల టీఎంసీలు వృథాగా సముద్రంలోకి వెళుతున్నాయి.సాంకేతికంగా దీనిపై దృష్టి పెట్టాలని ఎన్‌డబ్ల్యూడీఏ టాస్క్‌ఫోర్స్ అభిప్రాయ పడింది. నదుల అనుసంధాన ప్రాజెక్టులకు 43 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో నిధులు ఖర్చు చేస్తాయని అధికారులు తెలిపారు. తమ ప్రాజెక్టులన్నింటినీ ఆమోదించిన తరువాత మిగులు జలాలను తీసుకోవచ్చని తెలంగాణ తెలుపగా మార్గదర్శకాలకు లోబడి డీపీఆర్‌లను ఆమోదిస్తామని కేంద్ర అధికారులు అన్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవాలని ఏపీ కోరగా అన్ని రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరాల్సి ఉన్నందున సాధ్యపడదని తెలిపినట్లు సమాచారం
మరోవైపు ఇచ్చంపల్లికి అటుఇటుగా ఆనకట్ట నిర్మిస్తామని, సమ్మక్క సాగర్ నుంచి నీటిని తీసుకునేందుకు ఉన్న సాంకేతిక అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు ఎన్‌డబ్ల్యూడీఏ. ఇక ఛత్తీస్‌గఢ్‌ను సమావేశానికి ఆహ్వానించలేదని, ప్రధాని స్థాయిలో ఆ రాష్ట్రంతో చర్చలు జరుగుతాయని, వారికి ప్రత్యామ్నాయంగా విద్యుత్ కేటాయింపులు, పరిహారం లాంటివి ఉంటాయన్నారు. ఇకపై దేశంలో నిర్మించే అన్ని ప్రాజెక్టులు డ్రిప్ ఇరిగేషన్ విధానం పరిధిలోకి తెస్తామన్నారు. దీనికోసం ఒక అథారిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్ సభ్యులు గోపాలకృష్ణన్, ఏడీ మొహిలే, తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com