పశువుల కాపరి.. పట్టుదలతో ఆర్మీ ఆఫీసర్..

పశువుల కాపరి.. పట్టుదలతో ఆర్మీ ఆఫీసర్..
పట్టుదలతో ప్రయత్నిస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా అవలీలగా అధిగమించొచ్చని నిరూపిస్తుంటారు శరణ్యలాంటి వ్యక్తులు.

పట్టుదలతో ప్రయత్నిస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా అవలీలగా అధిగమించొచ్చని నిరూపిస్తుంటారు శరణ్యలాంటి వ్యక్తులు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా చదువుకోవాలన్న పట్టుదల ఆమెను ముందుకు నడిపించింది. పశువుల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్న ఆ కుటుంబంలో చదువుల తల్లి సరస్వతీ పుట్టిందని తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు.

ఈరోడ్ జిల్లాలోని అందియూరు సమీపంలో ఉన్న నంజమడైకుట్టై శరణ్య సొంతూరు. ఊరికి రవాణా సౌకర్యం అంతంత మాత్రమే.. అందియూర్‌లో ఉన్న బడికి రోజూ రెండు గంటలు ప్రయాణించి వెళ్లేది.. చదువంటే ఉన్న ఇష్టంతో చదువుకోవడం కోసం ఎంతదూరమైనా వెళ్లేది.. అలానే తనకు ఎంతో ఇష్టమైన కబడ్డీని కూడా ఆడుతుండేది.

ఈ క్రమంలోనే ఒకసారి అన్నావర్శిటీ తరపున ఆడే అవకాశం వచ్చింది. వాళ్లే సివిల్ ఇంజనీర్ చదువుకు అయ్యే ఖర్చుని భరించారు. శరణ్య చదువు పూర్తవడంతో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ లో ఉద్యోగం వచ్చింది.. మంచి జీతం వస్తున్నా కబడ్డీ ఆడలేకపోతున్నానన్న ఆలోచన తనని ఉద్యోగం చేయనివ్వలేదు. ఉద్యోగం మానేసి దృష్టంతా కబడ్డీపైనే పెట్టి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంది.

శరణ్య ఏం చేసినా అమ్మా నాన్న కాదనే వారు కాదు.. తనకు ఇష్టమైన రంగంలో రాణిస్తే అంతకంటే కావలసింది ఏం ఉంటుంది అనేవారు ఇరుగుపొరుగు వారు ఏమైనా అన్నా.


ఇదిలా ఉండగా శరణ్య ఆలోచనలు మిలటరీ వైపు మళ్లాయి. కానీ దానికి సంబంధించిన సమాచారం ఏమాత్రం తెలియదు.. ఊరినుంచి ఒక్కరు కూడా సైన్యంలోకి వెళ్లిన వారు లేరు. దాంతో సైనిక శిక్షణ ఎలా ఉంటుంది అని, ఎక్కడ ఇస్తారు అని చాలా మందిని అడిగి తెలుసుకునేది. గత ఏడాది జూన్ లో సైన్యంలో చేరడానికి ఎస్ఎస్ బీ (సర్వీస్ సెలక్షన్ బోర్డు) పరీక్షలు రాసింది.

శిక్షణ కోసం కోవైలోని ప్రైవేటు అకాడమీలో చేరింది.. మూడు నిమిషాలపాటు ఇంగ్లీషులో మాట్లాడడం వంటి టాస్కులు చాలా ఇచ్చేవారు.. మొదట్లో చాలా కష్టంగా ఉండేది. వాటిని చేయలేకపోవడంతో అకాడమీ నుంచి తీసేశారు. కానీ పట్టుదలతో ప్రయత్నించి మళ్లీ మూడు నెలల తర్వాత అకాడమీలో చేరింది. కోచ్ లెప్టినెంట్ ఈసన్ ఇచ్చిన శిక్షణతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగింది అని అంటుంది శరణ్య.

190 మంది శిక్షణకు వస్తే అందులో ఐదుగురు మాత్రమే సైన్యంలో చేరడానికి అర్హత సాధించారు.. అందులో శరణ్య ఒకరు. ఐదుగురిలో ముగ్గురు సైనిక కుటుంబాల నుంచి వచ్చిన వారు.. మారుమూల పల్లెటూరు నుంచి వచ్చింది శరణ్య మాత్రమే. చాలా మంది సైన్యంలో చేరితే ప్రాణాలు పోతాయి అని అనేవారు.. కానీ తల్లి మాత్రం ప్రాణాలు ఎక్కడైనా పోవచ్చు. అక్కడికి వెళ్తేనే పోతాయనేది పొరపాటు అని శరణ్య చేస్తున్న మంచి పనికి అడ్డు చెప్పే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు తల్లి తవలక్ష్మి.

Tags

Read MoreRead Less
Next Story