జనాభా నియంత్రణపై అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్

జనాభా నియంత్రణపై అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్

ప్రపంచంలోనే జనాభా ఎక్కువగా ఉన్న రెండో అతిపెద్ద దేశం మనది. పైగా త్వరలోనే చైనా స్థానాన్ని ఆక్రమించి మొదటి ప్లేసులోకి వస్తామని సర్వేలు కూడా చెబుతున్నాయి. అయినప్పటికీ.. పాప్యులేషన్ కంట్రోల్‌కు బలవంతపు చర్యలు తీసుకోబోమని చెప్పింది కేంద్రం.

జనాభా నియంత్రణ జరగాలంటూ పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అందరికీ ఆరోగ్యం, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయం జరగాలంటే జనాభా నియంత్రణ తప్పదని చెప్పుకొచ్చారు. అందరికీ సమాన అవకాశాలు రావాలన్నా జనాభా పెరుగుదలపై నియంత్రణ ఉండాలని వాదించారు. తక్షణమే మేమిద్దరం మాకిద్దరు అనే సూత్రాన్ని గట్టిగా అమలు చేయాలని కోరారు. జనాభా నియంత్రణ చట్టం తెచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించాలన్నారు. దీనిపై కేంద్రం స్పందించింది. బలవంతంగా జనాభాను నియంత్రించడం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. బాలబాలికల నిష్పత్తిలోనూ చాలా వ్యత్యాసం ఉండొచ్చని అభిప్రాయపడింది.

పిటిషనర్ చెప్పినట్టు చైనా మోడల్ పాటిస్తే.. భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులు రావొచ్చని కోర్టుకు తెలిపింది కేంద్రం. చైనాలో జనాభా నియంత్రణ వల్ల యువత సంఖ్య బాగా తగ్గి ఒకేసారి వృద్ధుల సంఖ్య పెరిగిందని, ప్రపంచవ్యాప్తంగా కూడా జనాభా నియంత్రణ సూత్రం వల్ల నష్టమే ఎక్కువ జరిగిన సందర్భాలున్నాయని కోర్టుకు తెలిపింది.

ఇండియాలో జనాభా నియంత్రణకు పెద్దగా చర్యలు తీసుకోవక్కర్లేదంది కేంద్రం. ఇప్పటికే ఒక్కరు, కష్టంగా ఇద్దరినే కంటున్నారు. ఆర్థిక స్తోమత ఉన్నా ఒకరిద్దరినే కనేందుకు ఇష్టపడుతున్నారని ఓ సర్వేలో తేలినట్టు చెప్పింది. 20ఏళ్ల క్రితం కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలి అన్నట్టు ఉండేది పరిస్ధితి. క్రమంగా ఇద్దరికి ఫిక్స్ అయ్యారు. రేపు ఒక్కరితోనే సరిపెట్టుకునే పరిస్థితి ఉండొచ్చనేది కేంద్రం భావన.

దక్షిణాదిలో జనాభా నియంత్రణ బాగా పాటిస్తారు. అదే.. యూపీ, బిహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, జార్ఖండ్, అస్సాంలో అయితే ఇప్పటికీ ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మందిని కంటున్నారు. ఈ ఏడు రాష్ట్రాల్లోనే 44 శాతం జనాభా ఉన్నారు. అందుకే, జనాభా నియంత్రణ కోసం నిబంధనలు కాకుండా.. పథకాలు ప్రవేశపెట్టామని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఇప్పటికే డజను పథకాల ద్వారా జనాభా నియంత్రణను ప్రోత్సహిస్తున్నామని చెప్పింది.

నిజానికి జనాభా పెరుగుదల వల్ల లాభాలు కూడా ఉన్నాయి. కరోనా ఉన్నా, ఆర్థిక మాంద్యం వచ్చినా భారత్ త్వరగా కోలుకుందంటే కారణం వినియోగమే. దేశ జనాభా అవసరాలను తీర్చాలంటే భారీ ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోవాలి. దానివల్ల పరిశ్రమలు పెరుగుతాయి, డిమాండ్‌ను బట్టి సప్లై కూడా పెంచాల్సి ఉంటుంది. దేశ ఆర్ధిక పురోగతి పరంగా జనాభా పెరుగుదల మంచిదే. అయితే, మంచినీళ్లు, ఆహారం విషయంలో మాత్రం కష్టాలు తప్పవు. పేదోళ్లు పేదోళ్లుగానే మిగిలిపోవచ్చు. డబ్బున్న వాళ్లకు మాత్రమే నాణ్యమైన నీరు, ఆహారం దొరకొచ్చు. అయితే, ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశమే కాబట్టి, అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కాబట్టి.. ఇండియాకు జనాభా పెరుగుదల బలం, లాభం అవుతాయన్న వాదన కూడా ఉంది.

Tags

Next Story