Sheela Bajaj: 77 ఏళ్ల వయసులో బామ్మ బిజినెస్.. రోజుకి ఆరుగంటలు కష్టపడుతూ..

Sheela Bajaj : షీలా బజాజ్ 77 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా మారారు. క్యాట్ క్రాఫ్ట్ హ్యాండెడ్ పేరుతో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఉంది. ఆమె మనుమరాలు అల్లడం పట్ల ఆమెకున్న అభిరుచిని గుర్తించింది. దానిని తన వృత్తిగా మార్చుకోమని బామ్మకి సలమా ఇచ్చింది. మనవరాలి సలహాతో మరింత ఉత్సాహంగా హెడ్‌బ్యాండ్‌లు, స్కార్ఫ్‌లు, స్వెటర్‌లు, మాస్క్‌లు, చెవిపోగులు చకచకా అల్లేస్తోంది బామ్మ.
షీలా బజాజ్ ఎప్పుడూ స్వతంత్ర జీవితాన్ని గడపాలని కోరుకుంది. ఎవరి మీదా ఆధారపడడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పుడు చదువుకోసం తల్లిదండ్రులతో పోరాడింది. 17 ఏళ్లు వచ్చే వరకు చదివింది.. 18 ఏళ్లకే కుటుంబసభ్యులు ఆమెకు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత అత్తమామలు వ్యతిరేకించడంతో ఆమె చదువుకు పుల్‌స్టాప్ పడింది.
ఇప్పుడు, ఆమె తన మనవరాలితో కలిసి ఉంటోంది. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండే బామ్మ కుట్లు, అల్లికల్లో మంచి ప్రావిణ్యం ఉందని తెలుసుకుంది మనవరాలు. దాంతో బామ్మకు ఓ అద్భుతమైన ఐడియా ఇచ్చింది.
తనపై తనకు నమ్మకం.. మనవరాలి ఆలోచన కలిసి వ్యాపారం ప్రారంభించింది బామ్మ. మనవరాలు బామ్మ కోసం ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఓపెన్ చేసింది. అందులో బామ్మ ఊలుతో తయారు చేసిన వస్తువులను పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఇది వారి జీవితంలో కొత్త అధ్యాయం.
షీలా బజాజ్ మాట్లాడుతూ.. 78 సంవత్సరాల వయస్సులో నా మొదటి సంపాదన రూ. 350. అది చూసి నాకెంతో సంతోషం, తృప్తి కలిగాయి. "ప్రారంభంలో ఆర్డర్స్ తక్కువగా వచ్చినా ఏ మాత్రం బాధపడలేదు.. కానీ నా మీద నాకు నమ్మకం.. మనవరాలి భరోసా కలిసి నా పని నేను చేస్తూ వెళ్లాను. ఈ వయసులో అవసరమా అని నిరుత్సాహ పరిచిన వారూ ఉన్నారు. ఇలాంటి వస్తువులు చాలా మంది చేస్తుంటారు.. నువ్వెందుకు తయారు చేయడం అని అన్నవారూ ఉన్నారు.
అయినా ఎప్పుడూ బాధ పడలేదు. వ్యాపారం ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత దేశం నలుమూలల నుండి ఆర్డర్లు రావడం ప్రారంభించాయి. అప్పటి వరకు ఓపిగ్గా ఉన్నాము. ఆపై వెనుదిరిగి చూడలేదు. ఒక్కోసారి ఒకే నెలలో 10 రెట్లు ఎక్కువ ఆర్డర్‌లను పొందాను. అయినా అలిసిపోకుండా పని చేస్తా.. అదే నా ఆరోగ్య రహస్యం కూడా అని చెబుతుంది బామ్మ. ఇప్పుడు, ఆమె తన వ్యాపారం కోసం రోజులో 6 గంటలు కష్టపడుతుంది. ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి కష్టం తెలియట్లేదు అని నవ్వేస్తుంది బామ్మ.
ఈ వయస్సులో, ఆమెకు స్వతంత్రంగా ఉండే అవకాశం వచ్చింది. ఏదైనా చేయాలనుకున్నప్పుడు వయసు అడ్డు కాదనడానికి ఆమె రుజువు. ఎవరు ఎన్ని అన్నా మనపై మనకు నమ్మకం ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతామంటారు బామ్మగారు. బామ్మ మాటలు అందరికీ స్ఫూర్తిదాయకం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

