బెంగాల్‌పై కేంద్రం సీరియస్‌

బెంగాల్‌పై కేంద్రం సీరియస్‌

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటన.. బెంగాల్‌ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈ అంశం కేంద్రం, బెంగాల్‌ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. దాడికి పాల్పడింది తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలేనని బీజేపీ ఆరోపిస్తుంటే.. బీజేపీ నాటకాలాడుతోందంటూ తృణమూల్‌ ఎదురుదాడి చేస్తోంది. అటు..కేంద్రహోంశాఖ.. బెంగాల్లో శాంతిభద్రతలు క్షీణించడంపై సమగ్ర నివేదికను సమర్పించాలని బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌కు ఆదేశించడం మరింత అగ్గిరాజేసింది.

ఇంతటితో ఆగలేదు కేంద్రం. శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 14న హాజరు కావాలంటూ కేంద్ర హోంశాఖ అధికారులు.. బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కేంద్రం సమన్లు జారీ చేశారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మమతా సర్కారు.. హోంశాఖ ఎదుట తమ ఉన్నతాధికారులు హాజరు కాబోరంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రానికి ఏకంగా లేఖ రాసింది. జడ్‌ కేటగిరీ భద్రత ఉన్న వాళ్లకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్లు బెంగాల్‌ సీఎస్‌ అల్పన్‌ బందోపాధ్యాయ్‌ కేంద్రానికి రాసిన లేఖలో తెలిపారు. నడ్డా కోసం రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు, పైలట్‌ను ఏర్పాటు చేసిందన్నారు. డైమండ్‌ హార్బర్‌కు వెళ్లే దారిలో భారీగా పోలీసు బలగాలను సైతం మోహరించామన్నారు. ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్‌ అయ్యారు హోంమంత్రి అమిత్‌షా. తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలతో బెంగాల్‌ చీకటియుగంలోకి వెళ్లిందని మండిపడ్డారు. బెంగాల్‌లో రాజకీయ హింసను సంస్థాగతం చేసి తీవ్రస్థాయికి తీసుకురావడం ఆందోళనకరమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.

బీజేపీ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో స్పందించారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. బీజేపీనే దాడులు చేయించి తిరిగి తమ పార్టీ కార్యకర్తలపై నిందలు మోపుతోందన్నారంటూ ఆరోపించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. అటు... తృణమూల్‌ ఎంపీలు సైతం స్పందించారు. రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకొనేలా పరిస్థితులను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు తన కాన్వాయ్‌పై జరిగిన దాడిపై జేపీ నడ్డా తీవ్రంగానే స్పందించారు. బెంగాల్‌ పూర్తిగా గూండా రాజ్యంలోకి జారిపోయిందన్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం నిరాశకు ఇదో నిదర్శనంగా కనబడుతోందని వ్యాఖ్యానించారు. అటు... నడ్డా కాన్వాయ్‌పై దాడిని బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్ ఖండించారు. రాష్ట్రంలో రోజురోజుకీ శాంతిభద్రతల పరిస్థితి దిగజారుతోందన్నారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన విధి అన్న ఆయన.. సీఎం మమత కూడా రాజ్యాంగాన్ని అనుసరించాలని సూచించారు. మొత్తానికి.. నడ్డా కాన్వాయ్‌పై దాడి వివాదం బెంగాల్‌లో రోజురోజుకు ప్రకంపనలు సృష్టిస్తోంది.

Tags

Next Story