జాతీయం

చెక్కపెట్టెలో చిన్నారి.. నదిపై తేలియాడుతూ..

ఏ తల్లి కన్న బిడ్డో.. ఎందుకు వదిలేసిందో.. తాను పెంచలేననుకుందో.. తనకంటే బాగా పెంచే వాళ్లకి ఆ బిడ్డ దొరకాలనుకుందో

చెక్కపెట్టెలో చిన్నారి.. నదిపై తేలియాడుతూ..
X

ఏ తల్లి కన్న బిడ్డో.. ఎందుకు వదిలేసిందో.. తాను పెంచలేననుకుందో.. తనకంటే బాగా పెంచే వాళ్లకి ఆ బిడ్డ దొరకాలనుకుందో.. 22 రోజుల ఆడ శిశువును ఓ చెక్క పెట్టెలో భద్రంగా ఉంచి, పసిబిడ్డతో పాటు దేవుడి చిత్ర పటాలు, చిన్నారి జాతక పత్రం రాసి ఉంచారు. పాప పేరు గంగ అని కూడా రాసి పెట్టెలో ఉంచి దాన్ని గంగా నదిలో వదిలారు. ఉత్తర ప్రదేశ్ ఘాజీపూర్ జిల్లాలో గంగా నదిపై తేలియాడుతున్న చెక్కపెట్టెను ఓ బోటు యజమాని మల్లాహ్ గుల్లు చూశారు.

అందులో నుంచి ఓ చిన్నారి ఏడుపు స్పష్టంగా వినిపించడాన్ని అతడు గుర్తించాడు. వెంటనే పెట్టెను తీసుకుని దాన్ని తెరిచి చూశాడు. చిన్నారిని దేవుడు ఇచ్చిన వరంగా భావించి ఇంటికి తీసుకెళ్లాడు. చిన్నారిని తామే పెంచుకోవాలని గుల్లు దంపతులు ఆశ పడ్డారు. పాపకు కావలసిన ఆహారాన్ని అందించారు. కానీ ఈ విషయం ఈ నోటా ఆ నోటా పాకి పోలీసులకు తెలిసింది. వెంటనే కేసు నమోదు చేసి చిన్నారిని స్వాధీనం చేసుకుని ఆశా జ్యోతి కేంద్రంలో ఉంచారు. వైద్యుల సూచన మేరకు పాపకు అన్ని పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రుల ఆచూకీ తెలిసే వరకు పాప ప్రభుత్వ సంరక్షణలోనే ఉంటుందని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు.

Next Story

RELATED STORIES