ఫేస్‌బుక్ ప్రేమ.. పాస్‌పోర్ట్ లేకుండా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌కి..

ఫేస్‌బుక్ ప్రేమ.. పాస్‌పోర్ట్ లేకుండా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌కి..
జరగబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా సరిహద్దులు దాటింది. ప్రస్తుతం అరెస్టై పోలీసుల అదుపులో ఉంది.

ప్రేమ.. ఎవరికి ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు.. ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తి కోసం ఖండాతరాలు దాటే సాహసం చేస్తున్నారు యువతీ యువకులు.. కధ సుఖాంతమైతే బాగానే ఉంటుంది.. కానీ కొన్ని కధలు విషాదాంతాలుగా మారిపోతుంటాయి. అతడి కోసం ఆమె బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌కి వచ్చింది.. ఫేస్‌బుక్‌ పరిచయం ఆమెని ఇంత దూరం వచ్చేలా చేసింది. జరగబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా సరిహద్దులు దాటింది. ప్రస్తుతం అరెస్టై పోలీసుల అదుపులో ఉంది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన శశిషేక్ (28) అనే యువకుడికి బంగ్లాదేశ్‌కు చెందిన పాపియా ఘోష్ (22) అనే యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆమె ఎఫ్‌బీ ఫోటో చూసి ఫ్లాటయ్యాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.. వలపు సంభాషణ మొదలైంది.

ప్రేమించిన ప్రియుని కోసం పాపియా ఘోష్ పాస్‌పోర్ట్ లేకుండా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. అనంతరం శశిషేక్ ఆమెను తీసుకుని తమిళనాడులోని తిరుపూర్‌ వెళ్లాడు. ఫిబ్రవరిలో పొల్లాచీలో వివాహం చేసుకుని మింజూర్‌లో కాపురం పెట్టారు. శశిషేక్ స్థానికంగా కంటెయినర్ యార్డ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

కుమార్తె కనిపించట్లేదని పోలీసులకు సమాచారం అందించారు పాపియా తల్లిదండ్రులు. బంగ్లాదేశ్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆమె భారత్‌లో ప్రవేశించినట్లు తెలుసుకున్నారు. బంగ్లాదేశ్ అధికారులు ఇచ్చిన వివరాలతో దర్యాప్తు ప్రారంభించారు భారత్‌కు చెందిన అధికారులు. క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆమె మింజూరులో ఉన్న్లట్లు గుర్తించారు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

పాపియా సరైన పత్రాలు, పాస్ పోర్టు లేకుండానే అక్రమంగా దేశంలోకి అడుగుపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ యువతిని పొన్నేరి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. పాపియాను బంగ్లాదేశ్ పంపించాలా లేక ఇక్కడే ఉంచాలా అనే విషయంపై ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్ణయం తీసుకుంటారని తిరువల్లూర్ ఎస్పీ పి అరవిందర్ తెలిపారు. పాపియా తన ప్రియుడికి దూరమవుతానేమోనని ఆందోళన చెందుతోంది.

Tags

Next Story