Bank locker: బ్యాంకు లాకర్ మీ వస్తువులు భద్రపరిచే ముందు..

Bank locker: విలువైన డాక్యుమెంట్లు, ఖరీదైన నగలు అన్నీ లాకర్‌లో పడేసి భద్రంగా ఉన్నాయనుకుంటాము కానీ అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. కొంత కాలం క్రితం వరకు బ్యాంకు లాకర్‌లో ఉన్న వస్తువులకు బ్యాంకు బాధ్యత వహించేది కాదు.
దొంగలు లాకర్లను కొల్లగొట్టినా బ్యాంకు ఏ మాత్రం బాధ్యత వహించేది కాదు. ఐతే ఇటీవల ఆర్‌బీఐ ఈ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. ఏదైనా దోపిడి, అగ్నిప్రమాదం, మోసం జరిగి లాకర్‌లోని వస్తువులు పోతే లాకర్ అద్దెకు 100 రెట్ల పరిహారం ఇవ్వాలని నిబంధనలు తీసుకొచ్చింది.
అయితే వినియోగదారులు లాకర్ ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. ఆ వివరాల జాబితా ఎప్పుడూ మీవద్ద ఉంచుకోవాలి. లాకర్‌లో నుంచి వస్తువులు తీసినప్పుడు, వేసినప్పుడు వివరాలను నమోదు చేయడం మర్చిపోవద్దు.
అయితే లాకర్‌లోనే ఉన్నాయి కదా సేఫ్‌గానే అని అనుకోవద్దు. ఏడాదికి ఒకసారైనా లాకర్‌ను తెరిచి చూసుకోవాలి. అంతకంటే ఎక్కువ కాలం అయితే బ్యాంకులకు దాన్ని పగులగొట్టే అధికారం ఉంది. అయితే ముందుగా వినియోగదారుడికి నోటీసులు పంపిస్తుంది. లాకర్ ఇన్ని రోజులు తెరవకపోవడానికి గల కారణం తెలియజేయాలి.
కొత్త నిబంధనల ప్రకారం లాకర్‌ను తెరిచే ముందు కొంత నగదును డిపాజిట్ చేయమని అడుగుతాయి. అయితే బ్యాంకులో నగదు నిల్వ అధికంగా ఉంటే ఖాతాదారులను ఈ డిపాజిట్ల గురించి ఒత్తిడి చేయదు బ్యాంకు. వరుసగా మూడేళ్లు లాకర్‌కు అద్దె చెల్లించకపోతే కూడా బ్యాంకులు బలవంతంగా లాకర్ తెరిచే అవకాశం ఉంది.
అన్నిటికీ మించి బ్యాంకు లాకర్ భద్రమే కాని వంద శాతం సురక్షితం అని చెప్పలేం. మీ విలువైన వస్తువులకు ఏదైనా నష్టం జరిగితే 100 శాతం నష్ట పరిహారం కూడా అందదు. అందుకే మీ విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకున్నా, లాకర్‌లో భద్రపరిచినా బీమా చేయించుకోవడం ఉత్తమం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com