ఇవాళ, రేపు ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్‌

ఇవాళ, రేపు ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్‌
నాలుగు రోజులు బ్యాంకులు పని చేయకపోవడంతో అటు వర్తక వ్యాపారులతో పాటు ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ, రేపు బ్యాంకు సిబ్బంది బంద్‌ పాటిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం రైల్వే, విద్యుత్‌ రంగాలను ప్రైవేటీకరిస్తూ నిర్ణయం తీసుకోగా.... ఇప్పుడు ప్రజలకు పెద్ద ఎత్తున సేవలను అందించే ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇవాళ, రేపు ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్‌ నేపథ్యంలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మె బాట పట్టారు.

ఇక బంద్‌ కారణంగా ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. గత రెండు రోజులు సెలవుల నేపథ్యంలో నాలుగు రోజులు బ్యాంకులు పని చేయకపోవడంతో అటు వర్తక వ్యాపారులతో పాటు ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందన్న అభిప్రాయాలు పలు రాజకీయ పక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర నిర్ణయం సరియైందికాదని ఇప్పటికే పలువురు విమర్శలు మొదలుపెట్టారు. బ్యాంకుల ప్రైవేటీకరణతో ప్రైవేటు బ్యాంకుల ఆధిపత్యం పెరిగి సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రజల సౌలభ్యం కోసం పెద్దఎత్తున బ్యాంకులను జాతీయం చేసి అందుబాటులోకి తీసుకురాగా ప్రస్తుత కేంద్ర నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడనున్నట్లు చెబుతున్నారు.

బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఙప్తి చేసినప్పటికీ పెడచేవిన పెట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం తన ఆలోచనను పునరాలోచించాలని, బ్యాంకుల ప్రైవేటీకరణ చర్యను మానుకోవాలని యూనియన్ల నేతలు హితవు పలుకుతున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణతో పేదప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అంటున్నారు. ముఖ్యంగా రైతులకు పంటల రుణాలు అందడంతో పాటు సామాన్య ప్రజలకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణతో ప్రైవేటు బ్యాంకుల అజమాయిషీ పెరుగుతోందని.. ఉద్యోగ అవకాశాలు కూడా లభించకుండా పోతాయని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story