ఐపీఎల్ టీమ్ లో 13 మందికి పాజిటివ్: బిసిసిఐ ప్రకటన

ఎన్నో అభ్యంతరాలు.. మరెన్నో ఆలోచనల నడుమ ఎట్టకేలకు ప్రారంభమైంది అని అనుకుంటున్న తరుణంలో కరోనా మహమ్మారి క్రికెట్ అభిమానుల ఐపీఎల్ మ్యాచ్ ఆనందాన్ని నీరుగార్చే పనిలో పడింది. 2020లో పాల్గోనబోతున్న టీమ్స్ లో ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. ఈ మేరకు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఇటీవల 1,988 మందికి కొవిడ్ పరీక్షలు జరపగా 13 మంది కరోనా బారిన పడినట్లు గుర్తించామని తెలిపింది. వీరిని ఇతర టీమ్ సభ్యుల నుంచి దూరంగా ఉంచుతామని పేర్కొంది. యూఏఈలో పాల్గొంటున్న అన్ని టీమ్ లకు చెందిన 1,988 మందికి ఆగస్ట్ 20 నుంచి 28 వరకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో ఆటగాళ్లు, బీసీసీఐ సిబ్బంది, హోటల్ సిబ్బంది, గ్రౌండ్ ట్రాన్స్ పోర్ట్ సిబ్బంది ఉన్నారు అని బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్ ప్రొటోకాల్ ప్రకారం ఐపీఎల్ సీజన్ పూర్తయ్యేంతవరకు పార్టిసిపెంట్లకు నిరంతర పరిక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. అయితే ఇంతకు ముందు వచ్చిన వార్తల ప్రకారం సీఎస్కే టీమ్ లోని సభ్యులు కోవిడ్ బారిన పడ్డారని తెలిసింది. కానీ బీసీసీఐ మాత్రం ఆ విషయాన్ని ధృవపరచలేదు. కాగా, టీ-20 టోర్నమెంట్ 13వ అడిషన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మంగళవారం జరగడం ఇదే మొదటిసారి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com