బీజేపీకి దాదా షాక్!

బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్ మాంచి జోరు మీద ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గరి నుంచి ప్రచారంతో హోరెత్తిస్తున్న దీదీ పార్టీ.. 294 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థుకలు సవాల్ విసిరారు. అయితే అందరూ అనుకున్నట్లుగానే ఆమె పోరాట గడ్డ నందిగ్రామ్ నుంచి పోటికి సై అన్నారు.
ప్రస్తుతం ఆమె భవానీపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నందిగ్రామ్‌ను ఎంచుకున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన కీలక నేత సుబేందు అధికారిని, కమలం పార్టీని రాజకీయంగా ఎదుర్కోడానికి ఈసారి ఆమె నందిగ్రామ్ నుంచి బరిలోకి కాలు దువ్వారు. 294 మంది స్థానాల్లో 50 మంది మహిళలకు సీట్లు కేటాయించారు. 79 మంది ఎస్సీలు, 42 మంది మైనార్టీలకు టికెట్లు ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్‌లో తూర్పు మేదినీపూర్ జిల్లాలో ఉన్న నందిగ్రామ్ ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. అయితే 2007లో ఓ ఇండోనేషియా కంపెనీ కోసం వామపక్ష ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దాదాపు మూడు నెలల పాటు సాగిన ఆ ఉద్యమాన్ని మమతా బెనర్జీ, సువేందు అధికారి ముందుండి నడిపించారు. ఈ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఓడించి దీదీ అధికారంలోకి వచ్చారు.
అలాంటి చోట నుంచి దీదీ పోటిచేస్తానని ప్రకటించడంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే ఈసారి దీదీని 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని ఆమె ప్రత్యర్థి సువేందు గట్టిగా చెబుతున్నారు. లేదంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసురుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ పోరు రసవత్తరంగా మారింది.
మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని తమ పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తున్న బీజేపీకి దాదా షాక్ ఇచ్చాడు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశాడు. అయితే బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com