Bharat Biotech: ముక్కు ద్వారా టీకా..డీసీజీఐ అనుమతి కోరిన భారత్ బయోటెక్

Coronavirus: కరోనాను ఎదుర్కొనేందుకు మరో మందును తీసుకొస్తోంది భారత్ బయోటెక్. ముక్కు ద్వారా ఇచ్చే చుక్కలమందు టీకాను తయారు చేస్తోంది. ఇప్పటికే దీనిపై క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటి ఫలితాలు రెండు మూడు నెలల్లో రావొచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. అందులో సత్ఫలితాలు వస్తే వెంటనే కరోనా చుక్కల మందు టీకాను మార్కెట్లోకి తీసుకొస్తామని చెబుతోంది.
ఇప్పటికే కొవాగ్జిన్ పేరుతో టీకాను తయారుచేసింది భారత్ బయోటెక్. అయితే, ఇంజక్షన్ ద్వారా ఇచ్చే టీకా కంటే.. ముక్కులో చుక్కల మందు ద్వారా టీకా ఇవ్వడం ఇంకా సౌకర్యంగా ఉంటుందని సంస్థ తెలిపింది. ఎక్కువ మంది జనాభా ఉన్న భారత్‌లో.. చుక్కల మందును తేలిగ్గా పంపిణీ చేయవచ్చని చెబుతోంది. పైగా చుక్కల మందును నెలకు 10 కోట్ల డోసుల చొప్పున తయారుచేయవచ్చని తెలిపింది. ఇప్పటికే ముక్కులో వేసుకునే చుక్కల మందు టీకా కోసం వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇన్ సెయింట్ లూయీస్‌తో లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుంది భారత్ బయోటెక్.
కొవాగ్జిన్ రెండో డోసుగా ముక్కు ద్వారా వేసుకునే చుక్కల మందు ఇస్తే ఎలా ఉంటుదన్న దానిపైనా భారత్ బయోటెక్ పరిశోధనలు చేస్తామంటోంది. మొదటి డోసుగా కొవాగ్జిన్‌ను తీసుకున్న వారికి, రెండో డోసు కింద చుక్కల మందు ఇస్తే.. ఎలా పనిచేస్తుందన్న దానిపై ప్రయోగాలు చేసేందుకు డీసీజీఐ అనుమతి కోరింది. ఈ విధానంలో సత్ఫలితాలు వస్తే.. కరోనాను ఎదుర్కొనేందుకు మరింత సామర్థ్యం లభించినట్టు అవుతుందని భారత్ బయోటెక్ అభిప్రాయపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com