గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌..!

గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌..!
కేంద్ర పరిశీలకులు నరేంద్రసింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ జోషీ ఆధ్వర్యంలో జరిగిన బీజేపీఎల్‌పీ సమావేశంలో భూపేంద్ర పటేల్‌ను ఏకగ్రీవంగా సీఎంగా నిర్ణయించారు.

గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌ ఎన్నికయ్యారు. కేంద్ర పరిశీలకులు నరేంద్రసింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ జోషీ ఆధ్వర్యంలో జరిగిన బీజేపీఎల్‌పీ సమావేశంలో భూపేంద్ర పటేల్‌ను ఏకగ్రీవంగా సీఎంగా నిర్ణయించారు. భూపేంద్ర పటేల్‌ పేరును విజయ్‌ రూపానీ ప్రతిపాదించారు. రూపానీ ప్రతిపాదనకు అందరూ ఆమోదం తెలిపారు. కొత్త సీఎం, మంత్రులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్‌లో అక్కడ ఎలక్షన్ జరగాలి. ఈలోపే సడన్‌గా విజయ్ రూపానీతో రాజీనామా చేయించారు. నిన్న అహ్మదాబాద్‌లో పాటీదార్ల విద్యాసంస్థ 'సర్దార్‌ ధామ్ భవన్'‌ ప్రారంభోత్సవం తర్వాత అనూహ్యంగా రూపానీ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రధాని మోదీ సహా ముఖ్యులంతా పాల్గొన్న కార్యక్రమం తర్వాత ఆయన రిజైన్‌ చేశారు. స్థానికంగా మారుతున్న రాజకీయ సమీకరణాల ప్రకారం పటేల్‌ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు ఇప్పుడు BJP ప్రయత్నం చేస్తోంది. 12 శాతం ఉన్న పాటీదార్ల ఓట్లు కీలకం కావడంతో ఆ సామాజికవర్గానికి చెందిన వారికే ముఖ్యమంత్రిపీఠం అప్పగించారని విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా పరిణామాలు చూస్తుంటే దేశవ్యాప్తంగా మరింత బలపడేందుకు BJP కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోందా అనే ప్రచారమూ జరుగుతోంది. ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది మార్చిలో CM త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. ఆయన తర్వాత తీరథ్‌ సింగ్‌ రావత్ బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలలు తిరక్కముందే ఆయన్నూ పక్కకుపెట్టి పుష్కర్ సింగ్ ధామీ కొత్త CM అయ్యారు. ఇక కర్నాటకలో ఇటీవలే యడియూరప్పను తప్పించారు. ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మైని CM చేశారు. ఇక ఇప్పుడు గుజరాత్ వంతు వచ్చింది. విజయ్ రూపానీ రాజీనామాకు దారి తీసిన పరిస్థితులపై స్పష్టత లేకపోయినా.. ఈ మార్పుల వెనుక BJP పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టే కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story