సైకిల్ మీద వస్తున్నారా.. సమస్యలన్నీ తీర్చేస్తారా: రజనీకాంత్ పార్టీ సింబల్‌పై ఆసక్తి

పది రోజుల క్రితమే పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్.. ఇప్పుడు పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త న్యూస్ చెప్పబోతున్నారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిజానికి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండే ఆయన ఈసారి అభిమానుల మధ్య జరుపుకోవచ్చని తెలుస్తోంది. అయితే 'అన్నాత్తే' షూటింగ్ నిమిత్తం ఈ నెల 14న హైదరాబాద్ రావాల్సి ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కీలక సమావేశంలో పార్టీ నేతలతో చర్చలు జరిపారు.
బుధవారం కోడంబాక్కంలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో మక్కల్ మండ్రం జిల్లా శాఖ నేతలు, నియోజక వర్గాల ఇన్‌ఛార్జిలతో రజనీ సమావేశమయ్యారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీకి సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పార్టీ జెండా రంగు, గుర్తు, పేరు తదితర విషయాలపై చర్చించారు.. తన ఫోటో ముద్రించాలా లేదా అనే విషయాలపై మండ్రం నేతల అభిప్రాయాలను రజనీ అడిగి తెలుసుకున్నారు. ప్రజలు పలికేందుకు సులువుగా ఉండేలా పార్టీ పేరు ఉండాలని ఆయన కోరారు.
పార్టీ గుర్తుగా సైకిల్ ఎంపిక చేయాలని మండ్రం నేతలంతా రజనీకి సూచించారు. రజనీ నటించిన అన్నామలై చిత్రంలో పాలవాడిగా సైకిల్‌పై పాడే పాటను ఎన్నికల ప్రచారానికి వాడుకోవచ్చని అది పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని తెలిపారు. అయితే రెండు వారాల్లో పార్టీ గుర్తును ఎంపిక చేస్తానని రజనీ వారికి హామీ ఇచ్చారు. ఇక ఈనెల 12న తన పుట్టిన రోజు వేడుకలను రజనీ అభిమానుల మధ్య జరుపుకుంటారని, వారిని నిరుత్సాహపరచకూడదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com