Punjab congress : బీజేపీలోకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి .. సాయంత్రం అమిత్ షాతో భేటి..!

Punjab congress : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీలో చేరబోతున్నట్టే కనిపిస్తోంది. ఈ సాయంత్రం అమిత్ షాతో సమావేశం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ అమరీందర్ సింగ్ భేటీ అవుతారని తెలుస్తోంది. ఇదే జరిగితే.. అమరీందర్ సింగ్ బీజేపీలో చేరడం ఖాయంగా భావించాల్సి ఉంటుంది. సిద్ధూ కారణంగా పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి సైతం వీడ్కోలు చెప్పేలా ఉన్నారు. ఇప్పటికే సిద్ధూని ఎమ్మెల్యేగా కూడా గెలవనీయబోనని సవాల్ విసిరారు అమరీందర్ సింగ్. కాంగ్రెస్‌లోనే ఉంటూ పీసీసీ చీఫ్‌గా ఉన్న సిద్ధూ ఓడిస్తానంటే అధిష్టానం చూస్తూ ఊరుకోదు. అందుకే, అమరీందర్ సింగ్ బీజేపీలో చేరాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
కెప్టెన్ అమరీందర్ సింగ్ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఒంటెద్దు పోకడతో పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానానికి పదేపదే ఫిర్యాదులు చేశారు సిద్ధూ. చివరికి కొంతమంది ఎమ్మెల్యేలు, క్యాబినెట్ మంత్రులను తన వర్గంలో చేర్చుకుని అమరీందర్‌పై తిరుగుబాటు చేశారు. ఈ వార్‌లో సిద్ధూనే గెలిచారు. అమరీందర్ సింగ్ పంజాబ్ సీఎంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. సీఎంగా రాజీనామా చేయడం తనకు అవమానమేనని, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ఆనాడే చెప్పారు. అన్నట్టుగానే ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయి. అమరీందర్ సింగ్ బీజేపీలో చేరితే.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కాకుండా.. కెప్టెన్ వర్సెస్ సిద్ధూగా ఎన్నికలు జరుగుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com