Bihar: దోపిడీ దొంగల బెండుతీశారు...

Bihar: దోపిడీ దొంగల బెండుతీశారు...
ధీర వనితలు... ఒంటి చేత్తో బ్యాంక్ దోపిడిని అడ్డుకున్నారు



ప్రాణాలకు తెగించి బ్యాంకు దోపిడీని అడ్డుకున్నారు ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్. ఈ ఘటన బీహార్ లోని పాట్నాలో జరిగింది. మహిళా కానిస్టేబుల్స్ చూపిన తెగువకు పోలీస్ డిపార్ట్ మెంట్ తో పాటు, ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

పాట్నా, హాజీపూర్ లోని సెంద్ చౌక్ వద్ద ఉన్న బీహార్ గ్రామీణ బ్యాంకులో జూహీ కుమారి, శాంతి కుమార్ కానిస్టేబుల్స్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ముగ్గరు దుండగులు బ్యాంకులోకి ప్రవేశించారు. ఎంట్రీ వద్ద ఉన్న మహిళా కానిస్టేబుల్స్, వారిని ఆపగా... ఎకౌంట్ లో డబ్బులు జమచేయడానికి వచ్చినట్లు చెప్పారు. పాస్ బుక్ చూపించాలని అడిగేసరికి.. జేబుల్లో నుంచి గన్స్ తీశారు దుండగులు. అప్రమత్తమైన మహిళా కానిస్టేబుల్స్, దుండగులను అడ్డుకున్నారు. ఊహించని పరిణామం ఎదురవడంతో దుండగులు పారిపోయారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ కాగా... ఇంటర్ నెట్ లో వీడియో వైరల్ అయింది. మహిళా కానిస్టేబుల్స్ చూపిన తెగువకు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో జూహీ అనే కానిస్టేబుల్ గాయపడింది.

మీడియాతో మాట్లాడిన జూహీ కుమారి, శాంతి కుమార్ దొంగలను ఎదుర్కొన్న వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. "దుండగులు బ్యాంకు లోపలికి రావడంతో ముగ్గురికి బ్యాంకులో పని ఉందా అని ప్రశ్నించాను. వారు అవును అని చెప్పగా.. నేను పాస్ బుక్ చూపించమని అడిగాను, దీంతో వారు గన్ ను బయటకు తీశారు. గన్ చూడగానే మేము వారిని అడ్డుకున్నాం. ప్రాణం పోయినా బ్యాంకులో దోపిడీ జరగవద్దని ప్రయత్నించాం. మా కృషి పలించింది" అని జూహీ చెప్పారు.

"వారు మా రైఫిల్స్ ను లాక్కోవడానికి ప్రయత్నించారు, కానీ ఏం జరిగినా బ్యాంకును దోచుకోవడానికిగాని, మా రైఫిల్స్ ను ఇవ్వడానికిగాని ఒప్పుకోలేదు. దుండగులు మా రైఫిల్స్ లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు జూహీ తన తుపాకీని ఎక్కుపెట్టింది. దీంతో దుండగులు పారిపోయారు" అని శాంతి కుమార్ చెప్పారు. తెగువ చూపి బ్యాంకు లూటీ కాకుండా అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్స్ కు రివార్డ్ దక్కనుందని పోలీస్ అధికారి ఓం ప్రకాష్ తెలిపారు.

Next Story