Bihar : రైల్వే ట్రాక్ ను మింగేశారు....

గతంలో జంగిల్ రాజ్‌గా అపప్రదను మూటగట్టుకున్న బిహార్ ఇప్పుడిప్పుడే ట్రాక్‌లో పడిందనుకున్నారు. కానీ ఏకంగా రైల్వే ట్రాక్‌నే మాయం చేశారు అక్కడి దొంగలు. రెండు కిలో మీటర్ల మేర రైలు పట్టాలను ఎత్తుకెళ్లారు. బిహార్ సమస్తిపూర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. గతంలో మొబైల్ సిగ్నల్ టవర్లు, బ్రిడ్జిల్లో వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈసారి ఏకంగా ట్రాక్‌నే మాయం చేయడం అందర్నీ ఆశ్చర్యపర్చుతోంది. దొంగలకు సహకరించిన ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. వీరి సస్పెన్షన్‌తోనే రైల్వే ట్రాక్ దొంగతనం బయటపడింది.
సమస్తిపూర్ రైల్వే డివిజన్ లోని పాండౌన్ స్టేషన్ నుంచి లోహత్ షుగర్ మిల్లు వరకు రైల్వే లైన్ ఉంది. అయితే అక్కడ చాలా కాలంగా చక్కర మిల్లు మూతపడడంతో ఈ లైన్ పై రైళ్లు తిరగడం లేదు. దీంతో ఆర్పీఎఫ్ సహకారంతో ట్రాక్‌ను వేలం వేయకుండా స్క్రాప్ డీలర్‌కు విక్రయించారు. వీరి వెనుక ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు. గతేడాది సమస్తిపూర్ రైల్వే డివిజన్‌లోని పుర్నియా కోర్టు స్టేషన్‌లో రైలు ఇంజిన్‌లోని స్క్రాప్‌ను విక్రయించారు. ఈ కేసులో ఆర్పీఎఫ్ సహా ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఏకంగా రైలు పట్టాలు ఎత్తుకెళ్లి విక్రయించడం సంచలనం సృష్టిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com