బీహార్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన మహాకూటమి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్రీయ జనతాదళ్ కూటమి సిద్ధమైంది. లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉండటంతో.... ఈ సారి సీఎం అభ్యర్థిగా లాలూ తనయుడు తేజస్వి యాదవ్‌ను ప్రతిపక్ష కూటమి ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది. మొత్తం 243 సీట్లకు గానూ... ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాలకు, కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పోటీ చేయనున్నాయి. ఇక లెఫ్ట్ పార్టీలకు 29 సీట్లు కేటాయించారు. సీపీఐ ఎంఎల్ 19 సీట్లలోను, సీపీఐ 6, సీపీఎం 4 స్థానాల్లో పోటీకి దిగనున్నాయి. ఇక ఈ మహా కూటమికి తేజస్వి యాదవ్ నేతృత్వం వహించనున్నారు. ఈ నెల 28 నుంచి మూడు దశల్లో రాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.
ఇక సీట్ల సర్దుబాటులో బీజేపీ, జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీల కూటమి మధ్య ఇంకా సంధి కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటుపై నిన్న దాదాపు నాలుగు గంటల పాటు నాయకుల మధ్య చర్చలు జరిగాయి. బీజేపీ సగం సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. చర్చల్లో కొన్ని సీట్లపై అవాంతరాలను మినహాయించి, 50-50 కేటాయింపులు ఉండాలనే వాదనను బలంగా వినిపించింది. సీట్ల సర్దుబాటుపై జేడీయు అధినేత నితీష్ కుమార్‌తో భేటీ ముగిసిన వెంటనే బీజేపీకి చెందిన ఇద్దరు బీహార్ ఇన్‌ఛార్జులు, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాజ్యసభ ఎంపీ భూపేంద్ర యాదవ్ ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ బీజేపీ తన జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com