బీహార్ ఎన్నికల ప్రచారం జోరందుకోవడంతో వేడెక్కిన రాజకీయ వాతావరణం

ప్రధాని నరేంద్ర మోదీ నేడు బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీయే తరఫున ససారాం, గయా, భగల్‌పూర్‌లో నిర్వహించే ర్యాలీల్లో మోదీ పాల్గొంటారని బీజేపీ వెల్లడించింది. ససారాంలో ఎన్‌డీఏ కూటమి నుంచి జనతాదళ్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచే మోదీ బీహార్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మోదీ ప్రచారం నిర్వహిస్తారని పార్టీ నేతలు తెలిపారు. మోదీ సందేశాన్ని డిజిటల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని వెల్లడించారు. ఎల్ఈడీల ద్వారా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో మోదీ ప్రసంగం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ తెలిపారు.
అటు.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేడు బీహార్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నవడాలోని హిసువా, భగల్పూర్‌లోని కహగాన్‌లో రాహుల్ ర్యాలీల్లో పాల్గొంటారు. మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో కలిసి హిసువాలో ప్రచారం నిర్వహిస్తారు. కహగాన్‌లో రాహుల్‌తో పాటు శక్తి సింగ్ గోహిల్ సహా సీనియర్ నేతలు ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు.. బీహార్ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే అగ్రనేతల ప్రచారంతో హోరెత్తిస్తోంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివిధ ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com