ఓ వలస కూలీ.. గ్రామంలో పారిశ్రామికవేత్తగా..

ఓ వలస కూలీ.. గ్రామంలో పారిశ్రామికవేత్తగా..
కరోనా వారి కుటుంబాల్లో చిచ్చు రేపింది.. లాక్డౌన్ తో బతుకులు రోడ్డున పడ్డాయి. మళ్లీ తట్టా బుట్ట సర్గుకుని ఊరికి పయనమయ్యారు..

ఊర్లో ఏదో ఒకటి చేసుకుని బతుకుదామనుకున్నా పట్నం ఊరించింది.. ఉన్న ఊరుని కన్న తల్లిని వదిలి పట్నం పయనమయ్యారు. పస్తులతోపడుకోనివ్వకుండా పట్నం చూసుకుంటుందని ఆశ పడ్డారు. కానీ కరోనా వారి కుటుంబాల్లో చిచ్చు రేపింది.. లాక్డౌన్ తో బతుకులు రోడ్డున పడ్డాయి. మళ్లీ తట్టా బుట్టా సర్దుకుని ఊరికి పయనమయ్యారు.. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది అంటారు.. తిరిగి వచ్చిన వారిని అమ్మలా కనిపెట్టుకుని చూసుకుంటోంది ఊరు. కడుపులో చల్ల కదలకుండా కూర్చోడానికి కాసులూ లేవు.. తాత ముత్తాలు సంపాదించిన ఆస్తులూ లేవు.. కష్టపడక తప్పని పరిస్థితి.. వాళ్ల ఆలోచనలు, వారి కష్టం వారినిప్పుడు ఎంటర్ ప్రెన్యూర్ ని చేసింది. కరోనా కాలంలో గ్రామాల నుంచి చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు తయారవుతున్నారు..

బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన కార్మికులు తమ సొంత పట్టణానికి తిరిగి వచ్చి క్రికెట్ బ్యాట్లు తయారు చేస్తూ బిజీగా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్, అవంతిపోరా, ఖాజిగుండ్‌కు వెళ్లిన ఈ వలస కార్మికులు బ్యాట్-తయారీ యూనిట్లలో ఉద్యోగం పొందారు. కోవిడ్ ఆంక్షలు నెలకొన్న నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయారు. దాంతో తిరిగి తమ ఊరికి పయనమయ్యారు. అలా వచ్చిన ఓ 10 మంది కార్మికులు నెలరోజుల క్రితం పశ్చిమ చంపారన్ జిల్లాలోని సహోద్రా గ్రామంలో స్థానికంగా క్రికెట్ బ్యాట్ యూనిట్‌ను స్థాపించారు. మొదట 50 బ్యాట్లను ఉత్పత్తి చేయగా.. అవి 1,2 రోజుల్లోనే అమ్ముడుపోయాయి. దాంతో వారికి మరింత ఉత్సాహం వచ్చింది. బ్యాట్ల నాణ్యతలో ఏ మాత్రం రాజీ పడకుండా మరి కొన్ని బ్యాట్ల తయారీకి పూనుకున్నారు.

పరసౌని గ్రామానికి చెందిన 30 ఏళ్ల అబులేష్ అన్సారీ పోప్లర్ చెట్టు కలప క్రికెట్ బ్యాట్ ల తయారీకి ఉపయోగిస్తున్నామని చెప్పాడు. అనంతనాగ్ లోని ఓ కర్మాగారంలో బ్యాట్ తయారీ నైపుణ్యాన్ని నేర్చుకున్నానని, ఇది కూడా ఒక కళ అని ఆయన చెప్పారు. "వెయ్యి రూపాయల కన్నా తక్కువకే బ్యాట్ దొరుకుతుండడంతో కొనుగోలు దారులు బ్యాట్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి బ్యాట్‌ను 800 రూపాయలకు అమ్మాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎందుకంటే పోప్లర్ చెట్టు జిల్లాలో సమృద్ధిగా పెరుగుతుంది. బ్యాట్ తయారీకి ఉపయోగించే కలప కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు.

నలుగురు స్నేహితులతో కలిసి గ్రామంలో బ్యాట్లు తయారు చేయడం మొదలు పెట్టిన అంబులేష్ ఇప్పుడు రాష్ట్రం అంతటికీ సరఫరా చేసే స్థాయికి ఎదిగాడు. అంబులేష్ బ్యాట్ల గురించి మీడియాలో కథనాలు రావడంతో జిల్లా కలెక్టర్ కుందన్ కుమార్ స్పందించారు. చేతి వృత్తి పనివారికి వ్యాపారవేత్తలుగా మారేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే పరిశ్రమ స్థాపించేందుకు ప్రభుత్వం నుంచి తగినంత ఆర్థిక సహాయం అందేలా చూశారు. రోజుకు 300-400 బ్యాట్లు తయారు చేస్తున్న తమ బృందం.. పరిశ్రమ స్థాపించిన తరువాత మరిన్ని బ్యాట్ల తయారీతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పించగలుగుతామని ఆనందంతో చెబుతున్నారు. కష్టానికి తగిన ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story