భయపెడుతోన్న బర్డ్ ఫ్లూ.. తెలంగాణలో ప్రమాదం లేదంటున్న అధికారులు

బర్డ్ ఫ్లూ మరోసారి భయపెడుతోంది. ప్రస్తుతానికి నాలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తున్న వైరస్.. తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తుందేమోనన్న అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో ఆందోళన మొదలైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోళ్లు చనిపోతుండడంతో.. తెలంగాణ పశుసంవర్థక శాఖ అప్రమత్తమైంది. అధికారులు ఎప్పటికప్పుడు కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరిస్తూ ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా డైరెక్టరేట్‌కు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న మాంసంలో 45 శాతం వాటా పౌల్ట్రీలదే. గొర్రె మాంసం 31 శాతం, మేక మాంసం 9, ఆవు, గేదె జాతి పశువుల మాంసం 15 శాతం ఉత్పత్తి అవుతున్నట్లు పశుసంవర్థక శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే కోడి మాంసం ఇక్కడే సమృద్ధిగా ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం రావటం లేదు. దీంతో మనకు బర్డ్ ఫ్లూ ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేనందున ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అయితే కోళ్ల పెంపకందారులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అటవీ శాఖ కూడా దీనిపై ఇంతవరకు రిపోర్టు ఇవ్వలేదు. కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరణ మాత్రం కొనసాగుతోంది. నెలకు 100 నుంచి 200 శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్స్‌లో పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.
కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులేమీ నమోదు కాలేదని, అయ్యే అవకాశం తక్కువేనని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com