Roopa Ganguly : రాజ్యసభలో ఏడ్చేసిన ఎంపీ రూపా గంగూలీ..

Roopa Ganguly : పశ్చిమ బెంగాల్‌లో సామూహిక హత్యలు సర్వసాధారణమైపోయాయని ఆరోపిస్తూ, బీజేపీకి చెందిన రూపా గంగూలీ శుక్రవారం పార్లమెంటులో విరుచుకుపడ్డారు.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలని ఆమె డిమాండ్ చేశారు. రాజ్యసభలో బీర్భూమ్ హింసాకాండపై ఆమె మాట్లాడుతూ.. బెంగాల్ నుంచి ప్రజలు భయంతో పారిపోతున్నారని ఎమోషనల్ అయ్యారు. ఇటీవల బీర్భూమ్ లో జరిగిన హింస గురించి ఆమె జీరో అవర్‌లో ప్రస్తావించారు. ఇక రూపా మాట్లాడుతున్న సమయంలో తృణమూల్ ఎంపీలు సభలో ఆందోళన సృష్టించారు.
కాగా మార్చి 22న బెంగాల్‌లోని బీర్భూమ్ గ్రామంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సజీవదహనం చేయడానికి ముందు వారిని చిత్రహింసలు పెట్టినట్టు పోస్టుమార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. అధికార తృణమూల్ పార్టీకి చెందిన ఓ నేత మృతి తర్వాత ఈ అల్లర్లు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com