కర్నాటక సీఎం యడియూరప్పకు పదవీగండం?

కర్నాటక సీఎం యడియూరప్పకు పదవీగండం?
కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు పదవీగండం తప్పేలా లేదు. సీఎం కుర్చీ నుంచి తప్పించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు పదవీగండం తప్పేలా లేదు. సీఎం కుర్చీ నుంచి తప్పించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరి 27న యడియూరప్ప పుట్టినరోజు. అప్పటి వరకు సీఎంగా ఉంచాలని యడియూరప్ప విజ్ఞప్తి చేసినప్పటికీ అంత సమయం లేదు మిత్రమా అంటోంది కేంద్ర నాయకత్వం. కనీసం రెండు నెలల వరకు కూడా వేచి ఉండే పరిస్థితి లేదంటే ఇవాళో రేపో కర్నాటక ముఖ్యమంత్రిని మార్చేస్తారనే అర్ధం. కర్నాటక ముఖ్యమంత్రిగా ఎవరిని కూర్చోబెట్టాలనే దానిపై ఇప్పటికే మోదీ, అమిత్‌షా మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి.

నాలుగు ఎకరాల భూవివాదం యడియూరప్ప మెడకు చుట్టుకుంది. ఏడేళ్ల క్రితం ఐటీ పార్కుల కోసం కేటాయించిన 4 ఎకరాలకు పైగా భూమిని డీనోటిఫై చేసి గృహ నిర్మాణ అవసరాలకు మళ్లించడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని యడియూరప్పపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలంటూ 2013లో లోకాయుక్త ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. లోకాయుక్త తీర్పును కొట్టివేయాలంటూ సీఎం యడియూరప్ప కర్నాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, కర్నాటక కోర్టు సీఎం పిటిషన్‌ను కొట్టేసింది. సీఎం నిర్ణయంపై దర్యాప్తు జరగాల్సిందేనని, అత్యంత పకడ్బందీగా జరిగేలా లోకాయుక్త కోర్టు పర్యవేక్షించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో యడియూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది.

యడియూరప్ప కుటుంబం అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ గత అక్టోబరులో ఓ టీవీ చానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో ఆ టీవీ చానెల్‌పై పోలీసులు దాడి చేసి మూసివేయించారు. దీనిపై కూడా బీజేపీ అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకే, యడియూరప్ప మాట, నిర్ణయాలను కేంద్ర బీజేపీ అస్సలు ఖాతరు చేయడం లేదు. రీసెంట్‌గా రాజ్యసభ అభ్యర్ధుల విషయంలో యడియూరప్ప చేసిన ప్రతిపాదనలను బీజేపీ పెద్దలు లెక్కలోకి తీసుకోలేదు. మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ చుట్టూ తిరిగినా సానుకూలంగా స్పందించలేదు. అంటే, యడియూరప్ప విషయంలో బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది.

75 ఏళ్లు దాటిన నేతలను పదవుల్లో కొనసాగించకూడదనేది బీజేపీ పాలసీ. కాని, కర్నాటకలో యడియూరప్ప తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. అందుకే, ఇప్పటి వరకు ఆయన్నే సీఎంగా కొనసాగించారు. ఇప్పుడిప్పుడే కొత్త వారి కోసం వేట మొదలైంది. కొత్త సీఎం రేసులో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, లింగాయత్‌ నేత లక్ష్మణ్‌ సావడి పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తం మీద వచ్చే రెండు మూడు రోజుల్లోనే ఏదో ఒక ప్రకటన వస్తుందని పార్టీ నేతలే చెబుతున్నారు.

Tags

Next Story