బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు..సువేందు ర్యాలీపై బాంబు దాడి

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలతో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సువేందు తలపెట్టిన ర్యాలీ తీవ్ర హింసకు దారితీసింది. మెడ్నీపూర్ జిల్లా హేరియా వైపు ర్యాలీ కోసం వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు నాటుబాంబులు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దుండగులు నాటు బాంబులు, రాళ్లు విసరడంతో పలువురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడిపై తీవ్ర ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు. తృణమూల్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ అధికార టీఎంసీ పేర్కొంది.
అటు..బెంగాల్ ఎన్నికల్లో నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. నందీగ్రామ్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఇటీవలే మమతపై తిరుగుబాటు ప్రకటించి, బీజేపీతో జతకట్టిన సువేందు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నందీగ్రామ్‌లో మమతను ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. టీఎంసీ ఒక పార్టీ కాదని..అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని అన్నారు. బీహార్ ఎన్నికల వ్యూహకర్తను టీఎంసీ తమ పార్టీకోసం ఉపయోగించుకోవడం చూస్తూంటే, రాష్ట్రంలో బీజేపీ ఎంతగా బలపడిందో అవగతమవుతుందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com