Uttar Pradesh: ముక్కు చిన్నగా ఉంది.. పొట్టిగా ఉన్నాడు.. వరుడిని రిజెక్ట్ చేసిన పెళ్లికూతురు

Uttar Pradesh: ఆరడుగుల అందగాడు కాడు, ఆజానుబాహుడు అంతకంటే కాడు. కాబోయే వరుడిని కలలో ఊహించుకుంది. మచ్చుకైనా ఒక్క లక్షణం కనిపించలేదు. అందుకే ఆరు నూరైనా ఈ పెళ్లి వద్దంది. మళ్లీ మాట్లాడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అందరి ముందు ఇంత అవమానం జరిగాక ఇంకెందుకు అక్కడ ఉండడం అని నిరాశగా వెనుదిరిగింది వరుడి కుటుంబం.
ఉత్తరప్రదేశ్ అష్రఫ్‌పూర్ గ్రామంలో బుధవారం జరిగిన ఓ వింత ఘటన చోటు చేసుకుంది. వరుడు ఊరేగింపుతో పెళ్లి మండపానికి వచ్చాడు. అతడిని చూడగానే వధువు ముఖం మాడిపోయింది. నేను ఇతడిని పెళ్లి చేసుకోను అని పెద్దగా అరిచింది. పెళ్లికి వచ్చిన పెద్దలందరూ సర్ధిచెప్పడానికి ప్రయత్నించినా వధువు నిరాకరించడంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చివరికి పెళ్లి ఆశతో వచ్చిన పెళ్లికొడుకు నిరాశతో వెనుదిరిగాడు.
అష్రాఫ్‌పూర్‌లో నివాసముంటున్న యువకుడికి అస్మోలీ ప్రాంతంలోని విలాల్‌పట్ గ్రామానికి చెందిన అమ్మాయితో సంబంధం కుదర్చారు పెద్దలు. బుధవారం అష్రఫ్‌పూర్‌కు చెందిన యువకులు అంగరంగ వైభవంగా బిలాల్‌పట్‌కు చేరుకున్నారు. బారాత్ గ్రామానికి చేరుకోగానే యువతి తరపు వారు వరుడిని ఇంటికి పిలిచి స్వాగతం పలికారు.
వరుడిని చూడగానే వధువు స్నేహితులు, బంధువులు అతడి ముక్కు చిన్నగా ఉందని, పొట్టిగా ఉన్నాడని గుసగుసలాడుకున్నారు. ఈ విషయం వధువు చెవికి చేరింది. వారి మాటలు విని వధువు పెళ్లికి నిరాకరించింది. బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటాను తల్లిదండ్రులను, బంధువులను బెదిరించింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఇతడిని పెళ్లి చేసుకోను అని ఖరాఖండిగా చెప్పింది.
బంధువులు వధువును శాంతింపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పాపం పెళ్లికొడుకు నిరాశగా వెనుదిరిగాడు. పెళ్లికి వచ్చిన అతిథులు కూడా నిరుత్సాహానికి గురయ్యారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఈ విషయం చర్చనీయాంశమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com