అన్నా నీతోపాటే నేను కూడా.. అన్నదమ్ములిద్దరూ ఒకే రోజు మృతి

అన్నా నీతోపాటే నేను కూడా.. అన్నదమ్ములిద్దరూ ఒకే రోజు మృతి
అతడికీ గుండె నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు వైద్యులు పరీక్షించి అతడు కూడా మృతి చెందాడని చెప్పారు.

పేగు తెంచుకు పుట్టిన అన్నదమ్ములు కూడా ఆస్తుల కోసం ఆరాట పడుతుంటారు. బతికున్నప్పుడే నువ్వెంత అంటే నువ్వెంత అని కత్తులు దూసుకుంటారు. పోయేటప్పుడు పైసా కూడా వెంట రాదని తెలిసినా పట్టింపులకు పోతారు.. డబ్బే పరమావధిగా బతుకుతారు. కానీ ఇక్కడ ఓ అన్న హఠాత్తుగా మరణించే సరికి తమ్ముడు తట్టుకోలేక పోయాడు.. తల్లడిల్లిపోయాడు.. గుండె పట్టుకుని తానూ ప్రాణాలు విడిచాడు.

గుంటూరు ఫాతిమా పురానికి చెందిన షేక్ అబ్దుల్ నబీ (40) బేకరీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అతడికి గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అన్న కళ్ల ముందే ప్రాణాలు విడవడం తమ్ముడు షేక్ దస్తగిరి (36) తట్టుకోలేకపోయాడు.

అతడికీ గుండె నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు వైద్యులు పరీక్షించి అతడు కూడా మృతి చెందాడని చెప్పారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి మృతి చెందడం స్థానిక వాసుల్ని సైతం కలచి వేసింది.

దస్తగిరి పెయింట్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. షేక్ నబీకి భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. నబీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావడంతో గుంటూరు పశ్చిమ తెదేపా ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర అన్నదమ్ముల భౌతికకాయాలను సందర్శించి నివాళులర్పించారు. అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లి వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Tags

Next Story