జనవరి 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

జనవరి 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు
పార్లమెంట్‌ ఆవరణలోని క్యాంటీన్లలో భోజనం ఇకపై మరింత ప్రియం కానుంది.

జనవరి 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలివిడత సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో విడత సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. జనవరి 29న ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.

కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ ఉభయసభలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. కొవిడ్‌ దృష్ట్యా ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నట్టు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమావేశమవుతాయని వెల్లడించారు. సెప్టెంబరులో జరిగిన విధంగానే లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్లలో సమావేశాలు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం మాత్రం సెంట్రల్‌ హాల్‌లో ఉంటుందని వివరించారు.

సమావేశానికి వచ్చే ఎంపీలంతా కరోనా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంపీల పీఏలు, వ్యక్తిగత సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఇందుకు ఈ నెల 27, 28న పార్లమెంట్‌ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి భారత్‌ ఇటువంటి సంక్షోభాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌ ప్రతికూలతల మధ్య ప్రవేశపెట్టనున్నారు. కొవిడ్‌ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఆంక్షలు సడలించిన తర్వాత రెండు త్రైమాసికాల్లో వృద్ధిరేటు సాధారణంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ కొంచెం పుంజుకుంది. ఇలాంటి సమయంలో తీసుకొనే ఆర్థిక ఉపశమన చర్యలు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై ఉత్కంఠ నెలకొంది.

పార్లమెంట్‌ ఆవరణలోని క్యాంటీన్లలో భోజనం ఇకపై మరింత ప్రియం కానుంది. ఈ భోజనంపై అందించే రాయితీని ఎత్తివేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. రాయితీ తొలగింపుతో ఏటా 8కోట్ల రూపాయలకు పైగా ఆదా అవుతుందని లోక్‌సభ సెక్రటేరియట్‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు పార్లమెంట్‌ క్యాంటీన్లను ఉత్తర రైల్వే నిర్వహించగా..ఇకపై ఐటీడీసీ నడుపుతుందని స్పీకర్‌ చెప్పారు.



Tags

Read MoreRead Less
Next Story