వింత గుడి.. బుల్లెట్ బైకే ఆ ఆలయంలో దేవుడు

వింత గుడి.. బుల్లెట్ బైకే ఆ ఆలయంలో దేవుడు
బైక్‌ని భక్తితో ఆరాధిస్తుంటారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని, కష్టాలు దూరమై సంతోషంగా ఉండాలని మొక్కుకుని వెళ్తుంటారు.

దేవుళ్లంటే రాముడు, కృష్ణుడు, శివుడు వాళ్లే కదా.. వాళ్లకే కదా గుడి కట్టి పూజించేది. అమ్మానాన్న అంటే ప్రేమ, గౌరవం ఉన్నవారు కూడా వారికి గుడి కట్టి తమ ప్రేమను చాటుకుంటారు. వెర్రి వేయితలలు వేస్తే తమ అభిమాన తారలకీ గుడి కడుతుంటారు సినిమా ప్రియులు. ఇవేవీ కాదని ఆ ఊరిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కి గుడి కట్టారు చుట్టు పక్కల గ్రామ వాసులు.

ఈ వింత గుడి రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి చాలా మంది భక్తులు వచ్చి మొక్కు కుంటారు. బైక్‌ని భక్తితో ఆరాధిస్తుంటారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని, కష్టాలు దూరమై సంతోషంగా ఉండాలని మొక్కుకుని వెళ్తుంటారు. ఈ దేవాలయాన్ని ఓం సింగ్ రాథోడ్ పేరుపై నిర్మించారు. ఆయన రాజస్థాన్‌లోని పాలీ టౌన్ సమీపంలో ఉన్న చౌటిలా గ్రామంలో నివసించేవారు. 30 ఏళ్ల క్రిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు.

ఆ సమయంలో ఆయన బుల్లెట్‌ బైక్‌పై ప్రయాణిస్తున్నారు. బైక్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయారు రాథోడ్. అనంతరం పోలీసులు బైకును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు. విచిత్రంగా ఆ మరుసటి రోజే బైక్ స్టేషన్ నుంచి మాయమైంది. ప్రమాదం ఎక్కడ జరిగిందో అక్కడ బైక్ కనిపించే సరికి పోలీసులు ఆశ్చర్యపోయారు. తెలిసిన వారి పనే అయి ఉంటుందని భావించి మళ్లీ బైక్‌ను అక్కడి నుంచి తీస్కెళ్లి స్టేషన్లో పెట్టారు.

ఈ సారి పోలీసులు మరింత ముందు జాగ్రత్తతో బండిలోని పెట్రోల్ తీసి లాక్ చేసి భద్రంగా ఉంచారు. తెల్లారిపాటికి బండి మళ్లీ మాయం.. ప్రమాదం జరిగిన ప్లేస్‌లో మళ్లీ ప్రత్యక్షం. పోలీసులకు విసుగొచ్చింది. ఎందుకొచ్చిన గొడవ అని బండిని రాధోడ్ కుటుంబసభ్యులకు అప్పగించారు. బండి మహత్యం చుట్టు పక్కల గ్రామాలకు తెలిసింది. దీంతో అందరూ కలిసి బండికి గుడి కట్టేశారు. దానికి బుల్లెట్ బాబా టెంపుల్ అని పేరు పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి బుల్లెట్ బైక్ పూజలందుకుంటోంది. కొబ్బరి కాయలు కొడుతూ, హారతులు ఇస్తూ భక్తులు తమ భక్తిని చాటుకుంటారు.

Tags

Next Story