Coffee Day CEO Malavika Hegde: కాఫీ డే అధినేత్రికి హ్యాట్సాఫ్.. వేల కోట్ల అప్పులు తీర్చి.. సంస్థను నిలబెట్టి..

Coffee Day CEO Malavika Hegde: కాఫీ డే అధినేత్రికి హ్యాట్సాఫ్.. వేల కోట్ల అప్పులు తీర్చి.. సంస్థను నిలబెట్టి..
Coffee Day CEO Malavika Hegde: సిద్ధార్థ్ తెరపై కనిపించినా.. తెరవెనుక మాళవిక ప్రోత్సాహం ఎక్కువ.

Coffee Day CEO Malavika Hegde: జీవితం కాఫీ అంత కమ్మగా ఉండదని తెలిసినా భర్త అడుగుజాడల్లో నడిచారు.. భర్తకు చేదోడు వాదోడుగా నిలిచారు. ఆయన అభిరుచుల్ని తన అభిరుచులుగా మార్చుకున్నారు.. అంతలోనే విషాదం.. ఇష్టపడి చేస్తున్న వ్యాపారంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.. వేల కోట్ల అప్పులు ఆత్మహత్యకు పురిగొల్పాయి.

కాఫీడే సీఈఓ సిద్ధార్థ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయినా అర్థాంగి మాళవిక.. మొక్కవోని ధైర్యంతో సంస్థను ముందుకు నడిపించారు. ఈ రోజు ఆమె గురించి అందరూ మాట్లాడుకునేలా చేశారు. కమ్మని కాఫీ రుచిని అందరూ ఆస్వాదించేలా చేస్తున్న మాళవిక అసలు జీవితం మాత్రం చాలా చేదుగా మొదలైంది. అయినా 7వేల కోట్ల అప్పులు.. 3వేల 500 కోట్ల అప్పుని కేవలం ఒక్క ఏడాదిలో ఎలా తీర్చగలిగారు..



కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ కుమార్తెగా మాళవిక హెగ్డే చాలా తక్కువ మందికి తెలుసు. కానీ 1991లో సిద్ధార్థను వివాహం చేసుకున్నాక ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. సిద్ధార్ధ మరణించే నాటికి ఆయన స్థాపించిన సంస్థ అప్పుల్లో కూరుకుపోయింది. అక్షరాలా రూ.7000 కోట్లు అప్పులు.. కాఫీడే చాప్టర్ క్లోజ్ అయిందని అందరూ అనుకున్నారు.. కానీ మాళవిక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాఫీడేని నిలబెట్టారు.. సంవత్సరంలోనే సగానికి పైగా అప్పులు తీర్చేశారు.. ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపి.. కాఫీడేకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చి 24,000 మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచించారు. భర్త సిద్ధార్ధ కన్న కలలను నిజం చేసేందుకు నిరంతరం కృషి చేశారు మాళవిక.

సిద్ధార్థతో ఆమె అనుబంధం 32 ఏళ్లు. సంస్థే అతడి ప్రపంచం. ఉద్యోగులే కుటుంబ సభ్యులు. ఆయన నిర్మించిన సామ్రాజ్యాన్ని నడిపే బాధ్యతను మాళవిక తీసుకున్నారు. సంస్థను అభివృద్ధి చేసేందుకు తనకంటూ కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నారు. వాటి కోసం నిరంతర శ్రమ. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన ఎన్నో సవాళ్లు, మరెన్నో ఆటంకాలు.. వాటన్నింటిని అధిగమించారు. భర్త వారసత్వాన్ని కొనసాగించాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. అతడు వదిలిపెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. ఈ క్రమంలో అప్పులు తీర్చడం ఆమె సాధించిన మొదటి విజయం.

అలా మొదలైంది.. కాఫీడే



సిద్ధార్ధతో పెళ్లైన తరువాత ఓ రోజు ఇద్దరూ కలిసి ఓ కేఫ్‌కి వెళ్లారు. కాఫీ డే ఆలోచన అక్కడే రూపుదిద్దుకుంది. నిజానికి ఆ ఆలోచన సిద్ధార్థదే. ఈ విషయాన్ని మొదట మాళవికతో పంచుకున్నప్పుడు ఆమె అంగీకరించలేదు. ఎక్కడైనా 5 రూపాయలకే కాఫీ దొరుకుతుంటే రూ.25లు పెట్టి ఎవరు కొంటారు.. తమ పార్లర్‌కి ఎందుకు వస్తారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఆ ఆలోచనను విరమించుకోమని సిద్ధార్ధకు సలహా ఇచ్చారు. దీంతో సిద్ధార్థ మళ్లీ దీర్ఘాలోచనలో పడ్డారు.

బిజినెస్ అయితే చేయాలి.. అది ఏంటి అనేది ఇంకా ఒక కొలిక్కి రాలేదు.. కానీ కాఫీడే ఆలోచన తన మదిలో నుంచి చెరిగిపోలేదు.. ఈసారి కాఫీతో పాటు ఉచిత ఇంటర్నెట్ అందిస్తే ఎలా ఉంటుంది అని భార్య ముందు మరో ప్రపోజల్ ఉంచారు సిద్ధార్థ. ఈ ఆలోచన ఆమెకీ నచ్చింది. ఇద్దరూ కలిసి ప్లాన్‌ చేసి మొట్ట మొదటి కేఫ్‌ని బెంగుళూరులో తెరిచారు. తొలి కాఫీ డే (CCD) అవుట్‌లెట్‌కి అదే మొదటి అడుగు. తర్వాత దేశవ్యాప్తంగా కాఫీడే అవుట్‌లెట్‌లు విస్తరించాయి.



భారతీయ ఆతిథ్య రంగంలో అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా కాఫీడే ఎదిగింది. సిద్ధార్థ్ తెరపై కనిపించినా.. తెరవెనుక మాళవిక ప్రోత్సాహం ఎక్కువ. అంతా బావుంది అనుకుంటున్న సమయంలోనే ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.. అప్పులు పెరిగిపోయాయి. భార్యతో తన ఆంతరంగిక విషయాలు పంచుకోలేని సిద్ధార్థ బలవన్మరణానికి పాల్పడ్డారు.. ఈ హఠాత్‌ పరిణామానికి కృంగిపోయిన మాళవిక బాధను దిగమింగుకుని తన ముందున్న కర్తవ్య నిర్వహణను గుర్తు చేసుకున్నారు. భర్త వదిలేసిన బాధ్యతను తన భుజాలకు ఎత్తుకున్నారు.. డిసెంబర్ 2020లో కంపెనీ సీఈవోగా పగ్గాలు చేపట్టి కాఫీడేని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. మహిళలకు స్ఫూర్తిదాయకం మాళవిక జీవితం.

Tags

Read MoreRead Less
Next Story