కొత్త స్ట్రెయిన్.. పసిడికి పెరిగిన డిమాండ్

కొత్త స్ట్రెయిన్.. పసిడికి పెరిగిన డిమాండ్
విదేశీ మార్కెట్‌లో వెండి కూడా అధికంగా 3 శాతం పెరగ్గా, దేశీయంగా రూ.1400 పెరిగింది.

ఓ పక్క కొత్త స్ట్రెయిన్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. మరో పక్క పసిడి ప్రియులు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 1.6 శాతం పుంజుకుని 1,926 డాలర్లకు చేరింది. ఇది ఎనిమిది వారాల గరిష్టం కాగా, ఈ బాటలో దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ రూ.565 బలపడింది.

విదేశీ మార్కెట్‌లో వెండి కూడా అధికంగా 3 శాతం పెరగ్గా, దేశీయంగా రూ.1400 పెరిగింది. కొత్త స్ట్రెయిన్ కారణంగా మళ్లీ ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చన్న ఉద్దేశంతో బంగారానికి డిమాండ్ పెరుగుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఎంసీఎక్స్‌లో పది గ్రాముల పసిడి ధర రూ.565 పెరిగి రూ.50,809 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ.50,300 వద్ద ప్రారంభమైన పసిడి ధర ఆ తర్వాత రూ.50,892 వద్ద గరిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ.1,394 పెరిగి రూ.69,517 వద్ద ట్రేడవుతోంది. రూ.68,499 వద్ద సానుకూలంగా ప్రారంభమైన వెండి ఒక దశలో రూ.70,259 వరకు దూసుకెళ్లింది.

న్యూయార్క్ మార్కెట్‌లో ప్రస్తుతం పసిడి ఔన్ప్ 31 డాలర్లు పెరిగి 1,926 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 1.3 శాతం బలపడి 1,923 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 3.1 శాతం పెరిగి 27.22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags

Next Story