సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపు.. బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడగింపునకు సంబంధించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సీబీఐ, ఈడీ అధిపతుల పదవీకాలాన్ని గరిష్ఠంగా ఐదేళ్ల వరకు పొడిగించేందుకు వీలుగా ఈ బిల్లు తీసుకొచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ నెల 3న ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపగా.. మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటు ద్వారా పెద్దల సభలోనూ బిల్లు పాస్ అయ్యింది.
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అవినీతి, నల్లధనంతో పాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటి అంతర్జాతీయ నేరాలు భారత్‌కు సవాలుగా మారుతున్నాయన్నారు జితేంద్రసింగ్. దేశ భద్రతతో పాటు ఆర్థిక వ్యవస్థకు కూడా ఇవి ముప్పేనని తెలిపారు. నేరాల తీరు మారిన నేపథ్యంలో దర్యాప్తు కష్టంగా మారుతోందని, అందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు.
సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం రెండేళ్లు మాత్రమే. అయితే అది పూర్తైన తర్వాత ఏడాది చొప్పున మొత్తం ఐదేళ్ల వరకు పదవీకాలాన్ని పొడిగించేందుకు అవకాశం కల్పిస్తూ గత నెల కేంద్రం రెండు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ఇప్పుడు వాటి స్థానంలో బిల్లు తీసుకురాగా.. పార్లమెంట్‌లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com