మినీ లాక్‌డౌన్‌లకు సిద్ధంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశాలు..!

మినీ లాక్‌డౌన్‌లు అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. నిన్న రాత్రి అన్ని రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మినీ లాక్‌డౌన్‌లు సమర్ధంగా పనిచేస్తాయని కేంద్రం అభిప్రాయ పడింది. మినీ లాక్‌డౌన్‌ల విషయంలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని సూచించింది. ఏదైనా ఏరియాలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం దాటితే గనక అక్కడ మినీ లాక్‌డౌన్ పెట్టాలని నిబంధనలు రూపొందించింది. ఇందుకోసం గత వారం రోజుల డేటాను తీసుకోవాలని కేంద్రం నిర్దేశించింది. అంతేకాదు, ఒక ఏరియాలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌తో కూడా ఐసీయూ బెడ్స్ 60 శాతం మించితే.. ఆ చుట్టుపక్కల ఏరియాల్లో సైతం మినీ లాక్‌డౌన్ పెట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది.
మినీ లాక్‌డౌన్‌లను పట్టణాలు, నగరాలు, జిల్లాలు, మున్సిపల్ వార్డులు, పంచాయతీలుగా వర్గీకరించాలని కేంద్రం ఆదేశించింది. మినీలాక్‌డౌన్ విధించిన ప్రాంతాల్లో అత్యవసర పనులు, కార్యాలయాలకు తప్ప మిగతా వాటిని మూసివేయాల్సి ఉంటుంది. ఉత్సవాలు, వేడుకలు, పొలిటికల్ మీటింగులు, విద్యాసంస్థలు, స్పోర్ట్స్, స్విమ్మింగ్ సెంటర్లు, షాపింగ్ కాంప్లెక్సులు, దుకాణాలను మూసివేయాలి. ఒకవిధంగా కంటైన్‌మెంట్ జోన్ల మాదిరిగానే మినీ లాక్‌డౌన్‌లు కూడా అమలుకానున్నాయి. అయితే, ఆంక్షలు కాస్త కఠినంగా అమలవుతాయి. మినీలాక్‌డౌన్‌లతో పాటు రాత్రి కర్ఫ్యూ, అత్యవసర కార్యకలాపాలు మినహా మిగిలిన అన్నింటిపైనా ఆంక్షలు విధించాలని కేంద్రం స్పష్టం చేసింది.
కఠిన ఆంక్షలు విధించే ముందు స్థానికులను ముందుగానే అప్రమత్తం చేయాలని కేంద్రం తెలిపింది. కంటైన్‌మెంట్‌ను ప్రకటించే ముందు ప్రజలు నిత్యావసరాలు సమకూర్చుకొనేందుకు తగిన సమయం ఇవ్వాలని కూడా చెప్పింది. ఎక్కువ కేసులున్న ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరిశీలించడంతోపాటు, తగిన సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని కేంద్రం సూచించింది. అనుమానం ఉన్నవారికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేపట్టాలని, లక్షణాలున్నప్పటికీ ఇందులో నెగెటివ్ వచ్చిన వారికి ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించింది. అంతేకాదు, పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలి, వైద్య సౌకర్యాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, అంబులెన్స్‌ల సమాచారంపైనా విస్తృత ప్రచారం చేయాలని కేంద్రం సూచించింది. అవసరమైతే వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి, వైద్యసేవలు అందించడంలో ఆలస్యం జరక్కుండా చూడాలని చెప్పింది కేంద్రం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com