ఏపీ బీజేపీలో కలవరం!

ఏపీలో దేవాలయాలపై ఇటీవల జరుగుతున్న వరుస దాడులపై బీజేపీ నేతలు దూకుడుగా ప్రవర్తించకపోవడంపై కేంద్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నేతలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినా పార్టీ బలోపేతానికి సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారని అగ్రనాయకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితే ఏపీలో బీజేపీకి ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు టీ.ఆర్.ఎస్.లోకి వెళతారనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఉంది. దీంతో ఆ రాష్ట్రంలో బీజేపి బలపడుతుంది. ఇదే రీతిన ఏపీలో కూడా బీజేపీకి ఓటేస్తే వైసీపీకి మద్దతిస్తారనే భావన ప్రజల్లో బలపడిందని అగ్రనాయకత్వం నిర్థారించుకుంది. రాష్ట్ర నాయకత్వం ఇలాగే వ్యవహరిస్తే ఏపీలో పార్టీ బలపడడం కలగానే మిగిలిపోతుందని భావిస్తున్నారు.
మరోవైపు బీజేపీ నేతల తీరుపై మిత్రపక్షమైన జనసేన నేతలు కూడా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తమతో కూడా సరిగా సమన్వయం చేసుకోలేని స్ధితిలో బీజేపీ నాయకత్వం ఉందని చెబుతున్నారు. కేంద్రం దన్ను చూసుకుని రాష్ట్ర నాయకత్వం మిడిసిపడుతుందని, తద్వారా ప్రదర్శితమవుతున్న పెద్దన్న పోకడలతో ప్రజలకు చేరువ కాలేకపోతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతికి మద్దతు పలికినా బీజేపి పట్ల సానుకూలత వ్యక్తం కాలేదన్నారు. అలాగే ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా నాయకత్వం సరిగా స్పందించలేకపోవడంపై కేంద్ర పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఇదే టైంలో ప్రజల్లో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీ ప్రణాళికా బద్దంగా తనకు అనుకూలంగా మలచుకుంటుందని భావిస్తున్నారు. మొత్తానికి ఏపీలో బీజేపి బలోపేతానికి ఏంచేయాలో అర్ధం కావడంలేదంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com