నూతన పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే!

ప్రధాని మోదీ పార్లమెంట్ కొత్త భవనం సెంట్రల్ విస్టాకు శంకుస్థాపన చేశారు. ఈ భవనం భూమిపూజలో ప్రధాని మోదీతో పాటు.. కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం సర్వమత ప్రార్థనలు జరిగాయి. పురివిప్పిన నెమలిలా, విరబూసిన కమలంలా ఈ భవనం కనిపించబోతోంది. అణువణువులో భారతీయత ఉట్టిపడేలా నిర్మించబోతున్నారు. కొత్త పార్లమెంటును నిశితంగా పరిశీలిస్తే.. జాతీయ పక్షి నెమలి, జాతీయ పువ్వు కమలం కనిపిస్తాయి. ఇక జాతీయ వృక్షమైన మర్రి చెట్టు కూడా పార్లమెంటులో అంతర్భాగంగా నిలవనుంది. లోక్‌సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలిలా కనిపించనుంది. రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉంటుంది. 971 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ కొత్త పార్లమెంటు భవనం 2022 నాటికి అందుబాటులోకి రానుంది.
కొత్త పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభ, ప్రధానమంత్రి కార్యాలయం, మంత్రుల కార్యాలయాలు, సెంట్రల్ హాలు, సెంట్రల్ లాంజ్, లైబ్రరీ, డైనింగ్ హాల్, కమిటీ హాళ్లు, కాన్‌స్టిట్యూషన్ హాల్, ప్రెస్ లాంజ్, సావనీర్ షాప్, సెక్యూరిటీ, రిసెప్షన్ భవనాలు ఉంటాయి. 480 సీట్ల సామర్ధ్యంతో మీడియా, సాధారణ ప్రజల కోసం లోక్‌సభ, రాజ్యసభ గ్యాలరీలు నిర్మించనున్నారు. గ్యాలరీల్లో కూర్చొనే ప్రజలకు సభా కార్యక్రమాలు కనిపించేలా 165 అంగుళాల స్క్రీన్లను ఏర్పాటుచేస్తారు. లోక్‌సభలో సభ్యులు కూర్చొనే సీటు పొడవు, వెడల్పుల నిష్పత్తి 60:40గా ఉంటుంది. ప్రతి ఎంపీకీ ఒక టచ్ స్క్రీన్‌తో కూడిన డిజిటల్ సిస్టమ్ ఉంటుంది. సభ్యులు వేసే ఓటు స్పష్టంగా కనిపించేందుకు వీలుగా నూతన భవనంలో 281 అంగుళాల వీడియో వాల్‌ను ఏర్పాటు చేస్తారు. 1315 చదరపు మీటర్లతో కడుతున్న లోక్‌సభే సెంట్రల్ హాల్‌గా ఉంటుంది.
జాతీయ వృక్షం మర్రిచెట్టును సెంట్రల్ లాంజ్ ఏర్పాటు చేస్తారు. మంత్రుల కార్యాలయాల్లో 20 లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కడుతుండగా, మరో 18 గ్రౌండ్ ఫ్లోర్‌లో, 26 మొదటి అంతస్తులో, 28 రెండో అంతస్తులో కడతారు. ప్రధానమంత్రి కార్యాలయం లోక్‌సభను ఆనుకొనే ఉంటుంది. 20 మీటర్ల ఎత్తులో కాన్‌స్టిట్యూషన్ హాలు నిర్మిస్తారు. దానిపై అశోక స్థూపాన్ని ఏర్పాటుచేస్తారు. ఈ హాలులోనే రాజ్యాంగాన్ని ప్రదర్శనకు ఉంచుతారు. వీవీఐపీల కోసం 2 గేట్లు, ఎంపీల వాహనాలు రావడానికి 2 గేట్లు, సాధారణ ప్రజలు, సిబ్బంది, మీడియా, సందర్శకుల కోసం 2 గేట్లు కేటాయిస్తారు. అడుగడుగునా అధునాతన నిఘా కెమెరాలు ఏర్పాటుచేయనున్నారు.
లోక్‌సభలో ఇప్పుడున్న సీట్ల సంఖ్య 552. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వీటి సంఖ్యను 888కి పెంచుతున్నారు. రాజ్యసభలో ఇప్పుడున్న సీట్లు 245. వీటి సంఖ్యను కూడా 384కి పెంచుతారు. ప్రస్తుతం సెంట్రల్ హాల్‌లో 436సీట్లుండగా.. దీని కెపాసిటీని 1,272కు పెంచుతున్నారు. ప్రస్తుతం 37 మంత్రుల కార్యాలయాలు ఉండగా.. కొత్త భవనంలో 92 ఆఫీసులు ఉంటాయి. ప్రస్తుతం 3 కమిటీ హాళ్లు ఉండగా.. ఇప్పుడు ఆరు కడుతున్నారు. గేట్ల సంఖ్య మాత్రం తగ్గుతోంది. ఇప్పుడున్న పార్లమెంట్ భవనానికి 12 గేట్లు ఉండగా.. ప్రస్తుతం ఆరు గేట్లు పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com