Central Government : కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

Central Government : కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ, రక్షణశాఖ, రా సెక్రటరీలు, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ల పదవీకాలాన్ని మరో రెండేళ్లు పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పదవుల్లో ఉన్నవారు కేవలం రెండేళ్లు మాత్రమే విధులు నిర్వర్తించాలనే నిబంధనలో సవరణలు చేసింది. అవసరమైతే మొత్తం ఐదేళ్లు పెంచుకునే వెసులుబాటును నోటిఫికేషన్‌లో పేర్కొంది. 2005లో కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్, హోంశాఖ సెక్రటరీలు, రా, ఐబీ చీఫ్‌ల పదవీకాలాన్ని రెండేళ్లకు పరిమితం చేసింది. అయితే తాజాగా ఆ రెండేళ్ల కాల పరిమితిని మరో రెండేళ్లు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.
అంతకుముందు సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీకాలాన్ని పొడగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఐబీ చీఫ్ అరవింద్ కుమార్, రా సెక్రటరీ సమంత్ గోయల్ పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగించింది. అలాగే కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా పదవీకాలం ఈ ఏడాది ఆగస్టులోనే పూర్తయింది. అయితే ఆయా పదవులను మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కారు నిర్ణయంపై గతంలో ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com