కాలుష్య కారకులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా

కాలుష్య కారకులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా

వాయు కాలుష్యం.. దేశ రాజధాని ఢిల్లీని గత కొన్ని సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య. ఎన్నికఠిన నిబంధనలు తీసుకొచ్చినా వాయుకాలుష్యం తగ్గడంలేదు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో కాస్తా తగ్గినా.. ఇప్పుడు భారీగా పెరిగింది. అయితే వాయుకాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీప్రభుత్వం వాహనాలకు సరిభేసి విధానాన్నికూడా అమలుచేసింది. దీంతో కొంతలో కొంత కాలుష్యం కంట్రోల్ అయినా.. పూర్తిస్థాయిలో దీన్ని పరిష్కారం చూపలేకపోయిది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం సహా ఇతర కాలుష్య కారకాలు పెరుగుతుండటంపై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. విశ్రాంత సుప్రీం న్యాయమూర్తితో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఆయా రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాయుకాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు కఠిన చట్టాన్ని తెస్తామని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

దీనిలో భాగంగానే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తాజాగా కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. కమిషన్‌ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఫర్ దిల్లీ-ఎన్‌సీఆర్‌ పేరిట దాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం కాలుష్య కారకులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించనున్నారు. పర్యావరణ కాలుష్యానికి పాల్పడేవారిపై, అలాగే తన ఆదేశాలను ఉల్లంఘించే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అధికారం కమిషన్‌కు ఉంది. హరియాణా, పంజాబ్, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలను కూడా కేంద్రం ఈ కమిషన్ పరిధిలోకి తీసుకువచ్చింది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం, దేశ రాజధాని నగరంతోపాటు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోసం ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ చైర్మన్‌ను పర్యావరణం, అడవుల శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక కమిటీలో సభ్యులుగా రవాణా, వాణిజ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులు, కేబినెట్ సెక్రటరీ వ్యవహరిస్తారు. ఈ కమిషన్ గాలి కలుషితమవడానికి దోహదపడుతున్న అంశాలను పరిశీలిస్తుంది. వరి దుబ్బుల కాల్చివేత, వాహన కాలుష్యం, ధూళి కాలుష్యం, గాలి నాణ్యతను క్షీణింపజేసే ఇతర అంశాలను పరిశీలిస్తుంది. ఈ కమిషన్ వార్షిక నివేదికలను పార్లమెంటుకు సమర్పిస్తుంది. కమిషన్ ఆదేశాలపై సివిల్ కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదు, కేవలం జాతీయ హరిత ట్రైబ్యునల్ లోనే సవాలు చేయవచ్చు.

వరి దుబ్బలను కాల్చడమే కాలుష్యానికి ఏకైక కారణం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డె అభిప్రాయపడ్డారు.ఈ విషయాన్ని కొందరు నిపుణులు చెప్పారని వెల్లడించారు. అయితే మీ అందమైన కార్లను వాడటం మానెయ్యాలని, మనమంతా సైకిళ్లపై వెళ్లాలని బాబ్డె సూచించారు. మీ సైకిళ్లను బయటకు తీయాల్సిన సమయం వచ్చిందన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అయితే కేంద్ర తీసుకొచ్చిన ఈ కొత్తచట్టంతోనైనా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ అవుతుందో.. వేచి చూడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story