Chennai: ప్రేమించిన వ్యక్తితో ఉదయం పెళ్లయ్యింది.. సాయింత్రం శవమయ్యాడు..

Chennai: కారణమేంటో తెలియదుకానీ.. కళకళలాడుతూ ఉండాల్సిన ఆ పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమెను అతడు ప్రేమించాడు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అంతాబాగానే ఉంది. ఆలూ మగలు సంతోషంగా కాపురం చేసుకుందామనుకున్నారు.. కానీ అంతలోనే అతడు మృత్యువాత పడ్డాడు.
చెన్నైలోని తాంబరానికి చెందిన సురేష్ కుమార్ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. చదువుకునే సమయంలో కోటకుప్పం ప్రాంతానికి చెందిన గోమతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం వచ్చింది.
వీరి ప్రేమ గురించి తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు శుక్రవారం ఉదయం పుదుచ్చేరిలోని కాలాపట్టు ప్రాంతంలో ఉన్న బాలమురుగన్ ఆలయంలో వివాహం చేశారు. సాయింత్రం రిసెప్షన్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు బంధువులు.
ఈ క్రమంలోనే దుస్తులు మార్చుకుందామని గదిలోకి వెళ్లిన పెళ్లికొడుకు సురేష్ ఎంతకూ బయటకు రావట్లేదు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు రూమ్‌లోకి వెళ్లి చూశారు. ఆ సమయంలో సురేష్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతడిని పుదుచ్చేరిలోని జిప్‌మర్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com