Chennai: ఆత్మహత్యకు పాల్పడ్డ తొమ్మిదేళ్ల చిన్నారి

Chennai: ఆత్మహత్యకు పాల్పడ్డ తొమ్మిదేళ్ల చిన్నారి
చదువుకోమని నాన్న మందలించడంతో మనస్తాపం చెంది... తువ్వాలుతో ఉరేసుకున్న చిన్నారి...

చీకూ చింతా లేకుండా ఆటపాటలతో గడిపేయాల్సిన వయసులో ఆ చిన్నారి తీసుకున్న విపరీత నిర్ణయం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. చావు పుట్టుకల గురించి అవగాహనే లేని వయసులో మెడకు ఉరితాడు బిగించుకుంది. ఇంటిల్లపాదికీ మురిపెం అయినా తీరకుండానే నిండు నూరేళ్లూ చాలించుకుంది. ఈ విషాదభరిత ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కృష్ణమూర్తి అనే వ్యక్తి బయటకు వెళుతూ అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటోన్న తొమ్మిదేళ్ల కుమార్తెను మందలించాడు. ఇంటికి వెళ్లి చదువుకోమంటూ ఇంటి తాళాలను అందజేశాడు. తండ్రి మందలింపుకు తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఉక్రోషంగా ఇంటికి వెళ్లి తలుపులేసుకుంది. తువ్వాలుతో మెడకు ఉరి బిగించుకుంది. బండిలో పెట్రోలు కొట్టించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కృష్ణమూర్తి కూతురుని తలుపు తీయవలసిందిగా పిలిచాడు. చిన్నారి ఎంతకూ స్పందించకపోవడంతో కిటికీలో నుంచి తొంగి చూసేసరికి పాపాయి తువ్వాలుకు వేలబడి గిలగిలా కొట్టుకోవడం చూసి హుతాశుడయ్యాడు. వెంటనే తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చిన్నారిని విడిపించినప్పటికీ ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించేసరికే చిన్నారి ప్రాణాలు వీడిందని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం చిన్నారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇన్స్టాలో యాక్టివ్ గా ఉండే చిన్నారి, రీల్స్ కూడా చేస్తుండేదని తెలుస్తోంది. దీంతో స్థానికంగా ఆమెను 'ఇన్స్టా క్వీన్' అనే పేరుతోనే ఇరుగు పొరుగు పిలిచేవారు.

Tags

Read MoreRead Less
Next Story